అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారతదేశంతో ఒక కీలకమైన వాణిజ్య ఒప్పందం (Trade Deal) కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, భారత ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకు గొప్ప గౌరవం మరియు ప్రేమ ఉన్నాయని బహిరంగంగా ప్రశంసించారు. ఈ మేరకు దక్షిణ కొరియాలోని గ్యోంగ్‌జులో తాజాగా జరిగిన ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) CEOల లంచ్ కార్యక్రమంలో ఆయన దీనిపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ గురించి ప్రస్తావిస్తూ.. “అందంగా కనిపించే వ్యక్తి,” “ఒక కిల్లర్,” మరియు “ఎంతో దృఢమైన వ్యక్తి (Tough as Hell)” అంటూ తనదైన శైలిలో పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే తన ఉద్దేశాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని సమాచారం. గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను కొనసాగించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భారతీయ వస్తువులపై 50 శాతం వరకు సుంకాలను (Tariffs) విధించిన విషయం తెలిసిందే.
అయితే, ప్రస్తుతం భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి అంగీకరించడంతో, అమెరికా కూడా ఈ 50 శాతం టారిఫ్‌ను దాదాపు 16 శాతం వరకు తగ్గించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం అమలైతే, రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు తిరిగి పుంజుకోవడానికి వీలు కలుగుతుంది.
ఇక ఈ సందర్భంగా ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు తన జోక్యం గురించి ప్రస్తావించారు. అణ్వాయుధాలు కలిగిన ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి, తాను ఇరు దేశాల నాయకులకు ఫోన్ చేసి, “మీరు పోరాడుతున్నంత కాలం మీతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోలేం” అని స్పష్టం చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా, యుద్ధం కొనసాగితే ఇరు దేశాలపై 250 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించినట్లు, దాని ఫలితంగా కేవలం రెండు రోజుల్లోనే వారు పోరాటం ఆపేశారని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే, భారత్ మాత్రం పాకిస్తాన్‌తో కాల్పుల విరమణపై తమంతట తామే, ద్విపక్ష చర్చల ద్వారా నిర్ణయం తీసుకున్నామని, ఇందులో అమెరికా జోక్యం ఏమీ లేదని పదేపదే స్పష్టం చేసింది. అయినప్పటికీ, ప్రధానమంత్రి మోదీ పట్ల తనకు ఉన్న గౌరవాన్ని, సానుకూల వైఖరిని వ్యక్తం చేస్తూ, భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ట్రంప్ ప్రకటించడం విశేషం.







































