అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను తమ దేశం నుంచి తరలించే పనినే ముందుగా మొదలు పెట్టారు. నెలరోజుల వ్యవధిలో 37,660 మంది అక్రమ వలసదారులను గుర్తించడమే కాకుండా.. వారిని ప్రత్యేక సైనిక విమానాల్లోవారి వారి దేశాలకు పంపించారు. అయితే తొలివిడతలో ట్రంప్ తరలించింది.. మాజీ అధ్యక్షుడు తరలించినవారితో పోలిస్తే తక్కువేనని వార్తా సంస్థ రాయిటర్స్ చెప్పడం హాట్ టాపిక్ అయింది.
హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం, అమెరికా మాజీ అధ్యక్షుడు జో బిడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. చివరి సంవత్సరంలో సుమారు 57 వేల మంది అక్రమ వలసదారులను గుర్తించి.. వారిని స్వదేశాలకు తిప్పి పంపించారు. అయితే తాజాగా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌లో భాగంగా లక్షలాది మంది అక్రమ వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ, తొలివిడతలో ట్రంప్ పంపించిన అక్రమవలసదారుల సంఖ్య కంటే కూడా . . బిడెన్ పరిపాలన చివరి పూర్తి సంవత్సరంలోనే ఎక్కువ బహిష్కరణ జరిగిందన్న లెక్కలతో ఇప్పుడు ట్రంప్ ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి.
పెద్ద సంఖ్యలో వలసదారులు చట్టవిరుద్ధంగా దేశంలోకి వచ్చి పట్టుబడ్డారు.దీని ద్వారా వారిని బహిష్కరించడం సులభం అవుతుంది. అక్రమ వలసదారుల అరెస్టులు, తొలగింపులను వేగవంతం చేయడానికి ట్రంప్ పరిపాలనా అధికారులు కొత్త మార్గాలను తెరుస్తుండటంతో.. రాబోయే నెలల్లో బహిష్కరణలు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అక్రమ వలసలు అప్పుడు ఎక్కువగా ఉండటం వల్ల బైడెన్ కాలం నాటి బహిష్కరణ సంఖ్యలు ఎక్కువగా కనిపించాయని అధికారులు చెబుతున్నారు. గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, పనామా, కోస్టారికా నుంచి∙ఇతర దేశాల నుంచి బహిష్కరించబడిన వారిని తీసుకోవడానికి ఒప్పందాల సహాయంతో బహిష్కరణ ప్రయత్నం చాలా నెలల్లో ప్రారంభమవుతుందని వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి.
జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక.. భారత్, గ్వాటెమాల, హోండురాస్, పనామా, ఈక్వెడార్, పెరూ దేశాలకు సైనిక బహిష్కరణ విమానాలలో అక్రమ వలసదారులను పంపింది. వలసదారులను గ్వాంటనామో బేలోని యూఎస్‌లోని నావికా స్థావరానికి కూడా తరలించింది. పౌర స్వేచ్ఛా సంఘాల నుంచి వ్యతిరేకత ఉన్నా కూడా, అక్కడ 30 వేల మంది వలసదారులను అదుపులోకి తీసుకోవడానికి సిద్ధం చేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. క్రిమినల్ రికార్డులు లేకుండా బహిష్కరించదగిన వలసదారులను అరెస్టు చేయకుండా వారి దేశాలకు పంపడానికి ట్రంప్ పరిపాలన ప్రయత్నిస్తోంది.