యునైటెడ్ స్టేట్స్లో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ వృత్తి నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు ఒక శుభవార్త. అమెరికా కార్మిక శాఖ (US Department of Labor – DOL) పరిధిలోని విదేశీ కార్మిక ధ్రువీకరణ కార్యాలయం (OFLC), నిలిపివేసిన H-1B, H-2A, H-2B మరియు PERM వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను తిరిగి ప్రారంభించింది.
కేంద్ర ప్రభుత్వం నిధుల కొరత కారణంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 నాటికి డీఓఎల్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీని ఫలితంగా, ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలు ఉపయోగించే ఆన్లైన్ వ్యవస్థ ఫారిన్ లేబర్ అప్లికేషన్ గేట్‌వే (FLAG) పోర్టల్ కూడా నిలిచిపోయింది.
ప్రాసెసింగ్ పునరుద్ధరణ వివరాలు:
-
పోర్టల్ పనితీరు: FLAG వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. దీంతో కంపెనీలు తిరిగి లేబర్ కండిషన్ అప్లికేషన్ (LCA) లను దాఖలు చేయవచ్చు. H-1B దరఖాస్తులకు ఇది అత్యంత కీలకమైన మొదటి అడుగు.
-
పునఃప్రారంభమైన సేవలు: తాత్కాలిక (H-1B) మరియు శాశ్వత ఉద్యోగాల కోసం అవసరమైన “ప్రబలిత వేతనాల నిర్ధారణ (Prevailing Wages)” మరియు “లేబర్ సర్టిఫికేషన్” ప్రక్రియలు తిరిగి మొదలయ్యాయి.
-
ప్రభావం: ఈ నిర్ణయం టెక్నాలజీ, ఆరోగ్యం, విద్య వంటి రంగాలలో విదేశీ నిపుణులపై ఆధారపడిన అమెరికా కంపెనీలకు, అలాగే గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులకు ఉపశమనం కలిగించింది.
పెండింగ్‌లో అధిక దరఖాస్తులు:
నిధుల కొరత కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల, పెద్ద మొత్తంలో దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ నేపథ్యంలో, OFLC కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చే వరకు దరఖాస్తుల పరిశీలన మరియు నిర్ణయాల వెల్లడికి సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని డీఓఎల్ హెచ్చరించింది.
ప్రాసెసింగ్ ఆలస్యం జరగవచ్చని దరఖాస్తుదారులు, యజమానులు అంచనా వేయాలని, అయితే వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇక ఈ చర్యతో భారతదేశానికి చెందిన వేలాదిమంది టెక్కీలకు ప్రయోజనం చేకూరనుంది.




































