అక్రమ వలసలను అరికట్టడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కఠిన విధానాలను అమలు చేయడం వల్ల జీవిత భాగస్వామి వీసా ప్రక్రియలు మరింత సంక్లిష్టంగా మారిపోయాయి.అమెరికా పౌరుడు లేదా గ్రీన్‌కార్డ్ హోల్డర్‌ను పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లాలని ఆశించే వారికి ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో చాలా ఈజీగా జరిగే ఇమిగ్రేషన్ ప్రక్రియలు ఇప్పుడు కఠినమైన నిబంధనలు, దీర్ఘకాలిక ఆలస్యాలతో నిండిపోతున్నాయి.
అమెరికా పౌరుడిని వివాహం చేసుకున్న వ్యక్తి కనుక భారతదేశంలో ఉంటే, వారు స్థానిక అమెరికన్ కాన్సులేట్‌లో కఠినమైన ఇంటర్వ్యూను ఎదుర్కోవాలి. ఈ ఇంటర్వ్యూలు గతంలో కంటే ఇప్పుడు మరింత డీప్‌గా జరుగుతున్నాయి. అమెరికా పౌరులు తమ జీవిత భాగస్వాముల కోసం స్పాన్సర్ చేసే వీసా కోసం ఫామ్ ఐ–130 అంటే పిటిషన్ ఫర్ ఏలియన్ రిలేటివ్ సబ్మిట్ చేయాలి. ఈ ఫామ్ ఆమోదం పొందడానికి సగటున 14 నెలలు పట్టవచ్చు. ఆ తర్వాత, వీసా ఇంటర్వ్యూ కోసం మరో 3.5 నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియ 17 నుంచి 20 నెలల వరకు సాగుతుంది.దీనివల్ల జంటలు దీర్ఘకాలం ఒకరినొకరు దూరంగా ఉండవలసి రావడం..దీంతో వ్యక్తిగత, భావోద్వేగ సవాళ్లను తెచ్చిపెడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే గ్రీన్‌కార్డ్ హోల్డర్లు తమ జీవిత భాగస్వాముల కోసం స్పాన్సర్ చేసే వీసాలు అంటే F2A కేటగిరీవి మరింత ఎక్కువ ఆలస్యమవనున్నాయి. ప్రస్తుతం, 2022 జనవరి 1 నాటి దరఖాస్తులు మాత్రమే పరిశీలిస్తున్నారు. అంటే మూడేళ్ల బ్యాక్‌లాగ్ ఉంది. దీనిప్రకారం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి వీసా పొందడానికి 3 నుంచి 4 ఏళ్ల సమయం పట్టవచ్చు. ఈ ఆలస్యం వల్ల చాలా మంది జంటలు తమ జీవిత ప్రణాళికలను పునఃసమీక్షించవలసి వస్తోంది. ఈ F2A కేటగిరీలో దరఖాస్తుదారుల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల ఈ బ్యాక్‌లాగ్ మరింత తీవ్రమైంది. అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థలో వీసా కోటాలపై ఉన్న పరిమితులు కూడా ఈ జాప్యానికి కారణంగా ఉన్నాయి.
ఒకవేళ జీవిత భాగస్వామి ఇప్పటికే H-1B వర్క్ వీసాపై అమెరికాలో ఉంటే, వారు గ్రీన్‌కార్డ్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంలో, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికారులతో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఈజీ అయినా కూడా.. ఇంటర్వ్యూల పెళ్లి జరిగిన విషయాలపై బలమైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.దీనికి తోడు H-1B నుంచి గ్రీన్‌కార్డ్‌కు మారే ప్రక్రియలో కూడా దేశ–నిర్దిష్ట కోటాల వల్ల కొంత ఆలస్యం ఉండవచ్చు.