వివాదాస్పద వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు ఎట్టకేలకు లోక్‌సభలో ఆమోద ముద్ర పడింది. బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు పోలవగా బిల్లును వ్యతిరేకిస్తూ 232 ఓట్లు పోలయ్యాయి. దీంతో లోక్‌సభలో ఈ బిల్లు పాసయింది. బిల్లు ఆమోదం కోసం జరిగిన చర్చలలో..అధికార, విపక్ష సభ్యుల వాదనలు ప్రతివాదనలతో సభ మార్మోగింది. ముందుగా 8 గంటలు అనుకున్నా ..వాద ప్రతివాదనలతో దాదాపు 14 గంటలకు పైగా రికార్డు స్థాయిలో చర్చ జరిగింది.
చివరకు 56 ఓట్ల తేడాతో లోక్‌సభలో విపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఎన్‌డీఏ మిత్ర పక్షాలు టీడీపీ,జేడీయూ,జనసేన, శివసేన షిండే,లోక్‌జన శక్తి బిల్లుకు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడంతో విపక్షాల అంచనాలు, అభ్యంతరాలు అన్నీ తలకిందులయ్యాయి. వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలపై జరిగిన చర్చలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ఇది చట్టవ్యతిరేకమని..జగడాల కోసమే ఈ బిల్లును తెచ్చారంటూ నిండు సభలో బిల్లు ప్రతుల్ని చింపేశారు.
అయితే వక్ఫ్ బోర్డులో కలెక్టర్‌కు చోటు కల్పించడాన్ని హోంమంత్రి అమిత్‌షా పూర్తిగా సమర్ధించారు . వక్ఫ్ భూముల పేరుతో గతంలో ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్తులను లాక్కున్నట్లు షా ఆరోపించారు. ఇకపై అలాంటి అక్రమాలకు తావుండదని క్లారిటీ ఇచ్చారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. మైనారిటీ సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్న ఎంపీ కృష్ణప్రసాద్..టీడీపీ ప్రతిపాదించిన మూడు సవరణలకి JPC ఒప్పుకుందని చెప్పారు. వక్ఫ్ బోర్డు ఏర్పాటులో రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని కేంద్రానికి టీడీపీ సూచించింది.
అయితే లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వైసీపీ మాత్రం వ్యతిరేకించింది. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ, ఏపీలో ముస్లింలకు అన్యాయం చేసిందని చెప్పారు. మరోవైపు పెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడమే పెద్ద సమస్యగా మారిందని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేయగా.. ఐదుగురు సభ్యుల నుంచి ఒకర్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి మీలా కుటుంబ పార్టీ కాదని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. సుదీర్ఘ చర్చ తర్వాత లోక్‌సభలో గట్టెక్కిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై.. ఇవాళ మధ్యాహ్నం రాజ్యసభలోనూ చర్చ జరుగుతుంది.