కొద్ది రోజులుగా వినిపిస్తున్న కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన విషాద ఘటనలో.. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. తాజాగా ఈ సంఖ్య 358కి చేరినట్లు అధికారులు చెబుతున్నారు. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగిపడటంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలిపారు. ఈ విపత్తులో అధికారిక సమాచారం మేరకు..ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 358కు పెరగగా.. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి వారు చెబుతున్నారు.
600మంది కార్మికులతో పాటు.. 281 మంది స్థానికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు . డ్రోన్‌లు, థర్మల్ స్కానర్‌ల ద్వారా మృతులను, గాయాలపాలయినవారిని గాలిస్తున్నారు. అయితే ముండక్కైలో కొట్టుకుపోయిన ఓ దుకాణం వద్ద.. శిథిలాల కింద మనుషులు ఉండొచ్చని థర్మెల్ స్కానర్ అప్రమత్తం చేసింది.కానీ 3 మీటర్ల లోతులో, ఐదు గంటల పాటు వెతికినా కూడా అక్కడ మనిషి ఆనవాళ్లు దొరకలేదు.
మరోవైపు, పశ్చిమ కనుమలలోని 56800 చదరపు కి.మీటర్ల ప్రాంతం పర్యావరణపరంగా చాలా సెన్సిటివ్ గా ఉందని చెబుతూ కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇప్పుడు వయనాడ్‌లో కొండచరియల విధ్వంసానికి గురైన 13 గ్రామాలు ఈ నోటిపికేషన్ జారీ చేసిన పరిధిలో ఉన్నాయి. వెదర్ సెన్సిటివిటీకి సంబంధించి తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. కేరళలో 9993.7 చదరపు కి.మీటర్ల విస్తీర్ణాన్ని సెన్సిటివ్ ప్రాంతంగా పేర్కొంది. అదేవిధంగా మహారాష్ట్రలో 17,340 కి.మీటర్ల విస్తీర్ణం, కర్ణాటకలో 20,668 కి.మీటర్ల విస్తీర్ణం, తమిళనాడులో 6,914 కి.మీటర్ల విస్తీర్ణం, గోవాలో 1,461కి.మీటర్ల విస్తీర్ణం, గుజరాత్‌లో 449 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దీని కిందకు వస్తుందని తెలిపింది.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విపత్తులో ఎక్కువగా నష్టం జరిగిన ముండక్కై, చూరల్‌మల ప్రాంతాలు నది ఒడ్డున ఉన్నాయని..నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ విశ్రాంత శాస్త్రవేత్త సోమన్ చెప్పారు. గతంలో ఇక్కడ కొండచరియలు విరిగి ఇదే నదిలో పడి ఉండవచ్చని, అది కాస్తా నదీ ప్రవాహం దిశ మార్చుకుని ఏర్పడిన ప్రాంతంపైనే ఇప్పుడు ఇండ్లు, దుకాణాలు వెలిసినట్లు సోమన్ అభిప్రాయపడ్డారు. నీటికి ఎప్పుడూ కూడా గత ప్రవాహం గుర్తు ఉంటుందని, అందుకే ఇప్పుడు ఆ నది గతంలో ప్రవహించిన దిశను మళ్లీ తీసుకోవడంతో తాజాగా ఇవన్నీ కొట్టుకుపోయి ఉండొచ్చని సోమన్ అన్నారు.