బెంగాల్లో ఏడో దశ అసెంబ్లీ ఎన్నికలు: మధ్యాహ్నం 3.30 గంటలకు 67.27 శాతం పోలింగ్

West Bengal Assembly Elections : 7th Phase Polling Underway

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఏడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3.30 గంటల వరకు 67.27 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏడో దశ పోలింగ్ లో భాగంగా సౌత్ కోల్‌కతాలోని బాబనిపూర్ నియోజకవర్గ పరిధిలోని మిత్ర ఇన్స్టిట్యూషన్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

–> ఈ దశలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం నాడు పోలింగ్ జరుగుతుండగా, అన్ని పార్టీల నుంచి 268 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 81,96,242 మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ పక్రియ కోసం మొత్తం 12,068 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముర్షిదాబాద్ లో 9, సౌత్ దీనాజ్‌పూర్ లో 6, మాల్డాలో 6, కోల్ కతా సౌత్ లో 4 మరియు వెస్ట్ బుర్ద్వాన్‌ లో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులు తీరారు.

–> మరోవైపు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, స్థానిక బలగాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు థర్మల్‌ స్కానింగ్ చేస్తూ, హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. బెంగాల్లో ముఖ్యంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్యే ప్రధాన పోటీనెలకుంది. కాంగ్రెస్, వామపక్షాల కూటమి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇక బెంగాల్లో ఏప్రిల్ 29న ఎనిమిదో దశ పోలింగ్ తో అసెంబ్లీ ఎన్నికలు ముగియనున్నాయి. మే 2న ఓట్లలెక్కింపు పక్రియను చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ