టీఎంసీ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. బుధవారం నాడు నందిగ్రామ్ లో నామినేషన్ వేసిన అనంతరం రేయపారా ప్రాంతంలో ఓ ఆలయాన్ని సందర్శించి వెళ్తున్న సందర్భంలో జరిగిన ఘటనలో ఆమె గాయపడ్డారు. ఆలయ సందర్శన తరవాత తిరిగి కారులోకి ఎక్కుతుండగా కొంతమంది తనను బలవంతంగా నెట్టివేసి, కారు తలుపు వేశారని, తనపై దాడికి ప్రయత్నించారని మమత బెనర్జీ వెల్లడించారు. ఈ ఘటన సమయంలో స్థానిక పోలీసులెవరూ తన చుట్టూ లేరని చెప్పారు. గాయపడిన మమతాబెనర్జీని వెంటనే కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితిపై గురువారం ఉదయం వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. బుధవారం రాత్రి నిర్వహించిన ప్రాథమిక వైద్య పరీక్షల్లో ఆమె ఎడమ కాలి చీలమండ మరియు పాదాలకు గాయమైనట్టు తేలిందన్నారు. అలాగే ఆమె కుడి భుజం, మోచేతికి మరియు మెడలో గాయాలు ఉన్నట్లు గుర్తించమన్నారు. మమతా బెనర్జీ ఆరోగ్యపరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని అన్నారు. ఛాతీనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని, రాబోయే 48 గంటలు ఆమె పరిశీలనలో ఉంటుందని పేర్కొన్నారు. మిగతా పరీక్షల అనంతరం ఆమెను పరిశీలించి తదుపరి చికిత్సను నిర్ణయిస్తామని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమతాబెనర్జీని పరామర్శించారు. అలాగే నందిగ్రామ్ లో జరిగిన ఈ ఘటనపై కేంద్రఎన్నికల సంఘం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఘటనపై బెంగాల్ లోని టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు పెద్దఎత్తున జరుగుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ






































