అర్ధ కుంభ, పూర్ణ కుంభ, మహా కుంభమేళా అంటే ఏంటి?

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా చాలా ఘనంగా జరుగుతుంది. ఈ కుంభమేళాకు దేశం, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు హాజరవుతున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలైన ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. అయితే కుంభమేళాలో..అర్ధ కుంభ, పూర్ణ కుంభ, మహా కుంభమేళా కూడా జరుగుతాయి.

సనాతన ధర్మంలో కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.అందుకే కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. వివిధ ప్రాంతాలకు చెందిన నాగ సాధువులు, అఘోరాలు కూడా ఈ జాతరలో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కుంభమేళా నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలైన ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగుతుంది. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా అత్యంత ఘనంగా జరుగుతోంది. వేద పండితులు చెబుతున్నదాని ప్రకారం మహా కుంభమేళా జనవరి 13, 2025 న ప్రారంభమయింది.

సూర్యుడు, చంద్రుడు మకర రాశిలో.. బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు కుంభమేళా స్థానాన్ని నిర్ణయిస్తారు. అపుడే ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా జరుగుతుంది. అదే సమయంలో సూర్యుడు మేష రాశిలో, బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లో కుంభమేళా నిర్వహిస్తారు.అలాగే సూర్యుడు సింహ రాశిలో, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు కూడా ఉజ్జయినిలో కుంభమేళా జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు, సింహ రాశి లేదా కర్కాటకంలో ఉన్నప్పుడు కూడా కుంభమేళా జరుగుతుంది. నాసిక్ లో ఈ కుంభమేళా జరుగుతుంది.

అలాగే అర్ధ కుంభమేళా ప్రతి ఆరేళ్లకోసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా ప్రయాగ్ రాజ్, హరిద్వార్ లలో మాత్రమే జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళాను నిర్వహిస్తారు. పన్నెండేళ్లకు ఒకసారి ప్రయాగ్ రాజ్ లోని సంగం ఒడ్డున పూర్ణ కుంభమేళాను నిర్వహిస్తారు. చివరిసారిగా 2013 లో ప్రయాగ్ రాజ్‌లో పూర్ణ కుంభమేళా జరిగింది. ప్రయాగ్ రాజ్ లో 12 ఏళ్ల క్రితం పూర్ణ కుంభమేళా జరిగినప్పుడు.. దానికి మహాకుంభ్ అని పేరు పెట్టారు. మహా కుంభమేళా 12 పూర్ణ కుంభాల్లో ఒకసారి జరుగుతుంది.ఈ మహా కుంభమేళా అయితే 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.ఇప్పుడు జరుగుతోంది అదే.

2025 జనవరి 13న పుష్య పౌర్ణమి నాడు మహాకుంభమేళా ప్రారంభం కావడంతో ఆరోజు తొలి రాజస్నానం జరిగింది. రెండో రాజస్నానం మకర సంక్రాంతి రోజు అంటే 2025 జనవరి 14న జరిగింది. మూడవ షాహీ స్నాన్- మౌని అమావాస్య నాడు 2025 జనవరి 29 న జరుగుతుంది. నాల్గవ రాజస్నానం వసంత పంచమి రోజు అంటే ఫిబ్రవరి 3, 2025 న జరుగుతుంది. ఐదవ రాజ స్నానం 2025 ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజు జరుగుతుంది. ఆరవ షాహీ స్నానం 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి, మహాకుంభమేళా చివరి రోజు జరుగుతుంది.

ఈ ఏడాది మహా కుంభమేళాలో 5.5 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను తయారు చేశారు. 11వేల త్రిశూలాలను కూడా ఉపయోగించారు. మొత్తం 12 జ్యోతిర్లింగాలు మహాకుంభానికి వచ్చే భక్తులకు ఇది ప్రధాన ఆకర్షణ అవుతున్నాయి. ఈ ప్రత్యేకమైన జ్యోతిర్లింగాన్ని అమేథీలోని మహాకుంభ సెక్టార్ 6లోని సంత్ పరమహంస ఆశ్రమం శిబిరంలో నిర్మించారు. దీనికోసం నేపాల్, మలేషియా నుంచి మేలురకాల రుద్రాక్షలను దిగుమతి చేసుకున్నారు. ప్రతి జ్యోతిర్లింగం 9 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తుతో ఉండేలా సిద్ధం చేశారు. దీనిలో ఉపయోగించిన 11వేల త్రిశూలాలకు తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు రంగులు వేశారు. ఈ జ్యోతిర్లింగాల దర్శనానికి, పూజలకు భక్తులను ఫిబ్రవరి 26 వరకు అనుమతిస్తారు.