ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే మహా కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. మహా కుంభ మేళాలో ఉన్న వేలాది మంది నాగ సాధువులు కుంభమేళా తర్వాత ఎక్కడికి వెళతారని ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. మహా కుంభమేళాలో ప్రతిరోజూ 50 లక్షల మంది వరకూ భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు 11 కోట్లకు పైగా ప్రజలు సంగంలో స్నానం చేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం పౌష పూర్ణిమ రోజు చేసే మొదటి స్నానం రోజు 1 కోటి 75 లక్షలకు పైగా ప్రజలు స్నానం చేశారు. మకర సంక్రాంతి రోజు అత్యధికంగా 3 కోట్ల 50 లక్షలకు పైగా అమృత స్నానం ఆచరించారు.
అయితే మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే నాగ సాధువులు సనాతన ధర్మాన్ని పాటిస్తారు. వీరిని అఖారా అని పిలుస్తారు. ఈ సాధువులు పూర్తి దిగంబరంగా ఉంటారు. వారు బట్టలు లేకుండా జీవించడం ద్వారా తమ ప్రాపంచిక కోరికలను త్యజించారనడానికి ప్రతీకగా చెబుతారు. ఈ నాగ సాధువులు గంగా, యమునా, సరస్వతి సంగమంలో పుణ్య స్నానం చేయడం ద్వారా తమ ధ్యానాన్ని మరింత శక్తివంతం చేసుకుంటారని అంటారు. వారి జీవితం తపస్సు, ధ్యానం, మోక్ష సాధన కోసమే అంకితం చేస్తారు. నాగ సాధువులు రోజంతా ధ్యానం, భగవంతుని సాధనలో గడుపుతారు. ముఖ్యంగా పవిత్ర స్నానం, ధ్యానంతోనే వారు సమయం గడిచిపోతుంది.
అయితే కుంభమేళా తర్వాత నాగ సాధువులంతా ఎక్కడికి వెళతారనే ప్రశ్న చాలామందిలో వినిపిస్తుంది. కుంభమేళా తర్వాత, నాగ సాధువులు తపస్సు కోసం తిరిగి వెళ్లిపోతారు. అయితే నాగసాధువులు దేశంలోని కొన్ని రాష్ట్రాలకు వెళ్లడానికే ఎక్కువగా ఇష్టపడతారట. కుంభమేళా తర్వాత, కొంతమంది నాగ సాధువులు ప్రయాగ్‌రాజ్ లోనే ఉండిపోగా..మరికొందరు మాత్రం నాసిక్, హరిద్వార్, ఉజ్జయిని వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలకు వెళ్లిపోతారు.
అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్, ఉత్తరాఖండ్ , బీహార్, రాజస్థాన్‌లలో ఉండే పుణ్యక్షేత్రాల వద్దకు వెళ్లడానికి నాగసాధవులు వెళ్లిపోతారు. నాగ సాధువులు వీధుల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే వారు ఏకాంతంగా జీవించడానికి , ధ్యానం చేయడానికి ఇష్టపడతారు. నాగ సాధువుల ఆరాధ్యదైవం శివుడు కాబట్టి..రోజంతా శివయ్య ధ్యానంలోనే ఉంటారు. కుంభమేళాకు మాత్రమే ఇంత పెద్ద సంఖ్యలో నాగ సాధువులు హాజరవుతారు. ఇక్కడ దీక్ష తీసుకున్న అనంతరం తిరిగి వారివారి ప్రదేశాలకు వెళ్లిపోతారు.