అమెరికా ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడింది.నవంబరు 5న ఎన్నికలు జరగనుండటంతో.. రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. ట్రంప్ అధ్యక్షుడైతే ఇండియాకు మంచిదా? భారతీయ మూలాలు ఉన్న కమలా హారిస్ అధ్యక్షురాలైతే భారత్‌కు మేలా? అనే ఆసక్తికర చర్చ భారతీయులతో పాటు ప్రవాస భారతీయుల్లో జరుగుతుంది.
వాణిజ్యపరంగా చూస్తూ భారత్‌కు అమెరికా చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. భారతదేశ మొదటి 10 వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో అమెరికాతోనే ఇండియాకు ట్రేడ్ సర్‌ప్లస్ ఉంది. అంటే అమెరికా నుంచి చేసుకుంటున్న దిగుమతుల కంటే కూడా అమెరికాకు భారత్ చేస్తున్న ఎగుమతులే ఎక్కువ.అందుకే భారత్‌తో వాణిజ్యం గురించి ట్రంప్ పదేపదే మాట్లాడుతూ వస్తున్నారు. దిగుమతులపై భారత్ ఎక్కువగా పన్నులు వేస్తుందని ఆరోపిస్తున్న ట్రంప్.. తాను గెలిస్తే ఈ పరిస్థితిని మార్చేస్తానని చెబుతున్నారు. ఇది భారత దేశానికి కొంత ఇబ్బందికరమే అని చెప్పొచ్చు. మరోవైపు కమలా హారిస్ కూడా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలను రూపొందించవచ్చనే భావన భారతీయుల్లో ఉంది. అయితే, ఇవి మరీ అసాధారణంగా ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు ఉన్నాయి.
డొనాల్డ్ ట్రంప్ గెలిచినా, కమలా హారిస్ గెలిచినా.. చైనాతో మాత్రం భారత్ కొంత దూకుడుగానే వ్యవహరించవచ్చు. భారత్‌లో సెమీకండక్టర్ ఫాబ్రికేషన్ కేంద్రం ఏర్పాటుకు, 6జీ మొబైల్ సాంకేతికత, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, అంతరిక్ష, సెమీకండక్టర్ వంటి అధునాతన సాంకేతికతలపై కలిసి పని చేయడానికి భారత్, అమెరికా ఇటీవలే ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. సాంకేతిక రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రయత్నించారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కూడా బైడెన్ పాటించిన విధానాలను కొనసాగిస్తారు కాబట్టి ఇది పరోక్షంగా భారత్‌కు మేలు కలిగిస్తుంది.
కాగా కొన్ని దశాబ్దాలుగా అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా, అధ్యక్షుడు రిపబ్లికన్ అయినా, డెమోక్రట్ అయినా సరే భారతదేశంతో మాత్రం సంబంధాలు బలపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిచినా, కమల హారిస్ గెలిచినా ఇదే కొనసాగొచ్చు. అయితే, ట్రంప్‌తో భారత ప్రధాని మోదీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అలా చూసుకుంటే ఇటు కమలా హారిస్‌కు భారతీయ మూలాలు ఉండటం కూడా భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే వలస విధానం విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలు, విధానాలు మొదటి నుంచీ కూడా కొంత కఠినంగానే ఉంటాయి. ఈ ఎన్నికల్లో కూడా ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంపైనే ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి తగ్గట్లు ట్రంప్ గెలిస్తే అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించొచ్చు. ఇటు భారతీయులకు కీలకమైన హెచ్1బీ వీసాలపైన కూడా డొనాల్డ్ ట్రంప్ పరిమితులు విధించవచ్చనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి కమలా హారిస్ విధానాలు మాత్రం కొంత వలసదారులకు అనుకూలంగా ఉండొచ్చనే అంచనాలున్నాయి.