ప్రస్తుతం దేశంలో జరుగుతున్న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలుగా గుర్తింపు పొందాయి. ఏప్రిల్ 19 నుంచి 44 రోజుల పాటు ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 19తో ప్రారంభమైన ఈ ఎన్నికలు జూన్ 1 వరకు కొనసాగనున్నాయి. ఏడు దశల్లో జరిగే ఎన్నికల్లో మొత్తం 543 మంది సభ్యులను భారతదేశానికి చెందిన 97 కోట్ల మంది ఓటర్లు ఎన్నుకోనున్నారు. కాగా.., ఇప్పటికే నాలుగు దశలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు ఏ పార్టీకి ఎన్ని సీట్లలో ఓట్లు ఆశాజనకంగా పడ్డాయోనన్న చర్చ జరుగుతోంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. వీటితో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 379 స్థానాల్లో పోలింగ్ ముగిసినట్టయింది. అలాగే.. ఏపీ, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాలన్నింటికీ, ఒడిశాలో 28 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు ముగిశాయి.
మొత్తంగా శ్రీనగర్ నియోజకవర్గంలో అతి తక్కువగా 37.98 శాతం ఓటింగ్ నమోదైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఈ తొలి ఎన్నికల్లో 38 శాతం అంటే మనకు తక్కువ అనిపించవచ్చుగానీ.. గత కొన్ని దశాబ్దాల్లో ఇదే అక్కడ అత్యధికం అని ఈసీ ప్రకటించడం గమనార్హం. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, ఆయన కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా.. ఆయన కుమారులు జమీర్, జహీర్ అబ్దుల్లా.. ఇలా అబ్దుల్లాకుటుంబానికి చెందిన మూడు తరాల వారు తమ ఓటు హక్కును శ్రీనగర్‌లో వినియోగించుకున్నారు. కాగా, 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో మే 20న ఐదో దశ జరగనుంది. ఆ తర్వాత.. మే 25, జూన్ 1న జరిగే మరో రెండు దశల పోలింగ్‌తో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగుస్తుంది.
ఇప్పటిదాకా జరిగిన నాలుగు దశల ఎన్నికలతో ప్రజల తీర్పు ఎన్డీయే కూటమికే అనుకూలంగా ఉన్నదని ప్రధాని మోదీ సోమవారం ట్వీట్ చేశారు. ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశం నలుమూలలా ఎన్డీయే అభ్యర్థులకు మంచి మద్దతు లభిస్తోంది. ఇండియా కూటమి అసలు ప్రజల చర్చల్లోనే ఉండట్లేదని ఎద్దేవా చేశారు. అలాగే.. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఇప్పటికే 270 సీట్లు గెలిచినట్టు తాను చెప్పగలనని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. 400కు పైగా సీట్లలో గెలుపు సాధించడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో తాము పోరాడుతున్నామని పశ్చిమబెంగాల్‌లోని బాంగావ్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన వివరించారు. బాంగావ్ లో జరిగిన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ”ఇంతవరకూ నాలుగు విడతల పోలింగ్ పూర్తయింది. 380 సీట్లకు ఎన్నికలు జరిగాయి. బెంగాల్‌లో కూడా 18 సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. 380 సీట్లలో ప్రధాని మోదీ 270 సీట్లు గెలుచుకోవడం ద్వారా సంపూర్ణ మెజారిటీని సాధించారని నేను కచ్చితంగా చెప్పగలను. 400కు పైగా సీట్లు గెలుచుకోవడమే మా లక్ష్యం” అని అమిత్‌షా అన్నారు.
అయితే.. ఇండియా కూటమికే ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన 380 సీట్లలో తమ కూటమికే మెజారిటీ సీట్లు వస్తాయని ఇండియా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ, దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని, మూడో కూటమికి చాన్స్ ఉందని జోష్యం చెబుతున్నారు. అన్నీ కలిసి వస్తే తానూ ప్రధాని రేసులో ఉంటానని పేర్కొంటున్నారు. ఇంకా మూడు దశల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ కూడా లేకపోవడంతో ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఎవరి అంచనాలకూ అందడం లేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY