దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మరణించడంతో ఒక శకం ముగిసింది. టాటా కుటుంబం ఒక మూలస్థంబాన్ని కోల్పోయింది. జెమ్‌షెడ్‌జీ టాటా ప్రారంభించిన కంపెనీని తదుపరి స్థాయికి ఎదగడంలో రతన్ టాటా పాత్ర అత్యంత విలువైనది. అయితే ఆయన నిష్క్రమణ తర్వాత సంస్థను ఎవరు వారసత్వంగా పొందుతారు? ఇప్పటి వరకు టాటా గ్రూప్ యాజమాన్యం సహజంగానే కుటుంబంలోని తదుపరి తరానికి బదిలీ చేయబడింది. రతన్ టాటా అవివాహితుడు. అందువల్ల ఆయన యొక్క వారసత్వాన్ని కొనసాగించడానికి వారి తరువాత తరం లేదు. దాదాపు రూ.3,800 కోట్ల విలువైన కంపెనీని నిర్వహిస్తున్న టాటా ట్రస్ట్ నాయకత్వం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
టాటా ట్రస్ట్‌ల నాయకత్వం తరతరాలుగా టాటా కుటుంబం మరియు పార్సీ కమ్యూనిటీతో ఉంది. టాటా సన్స్ ఛైర్మన్‌గా మరియు టాటా ట్రస్ట్‌లకు అధ్యక్షత వహించడంతోపాటు రతన్ టాటా రెండింటినీ నిర్వహించిన చివరి వ్యక్తిగా నిలిచారు. అయితే 2022లో, సంస్థ యొక్క ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ సవరించబడింది. అలా ఈ రెండు బాధ్యతలు వేరు చేయబడ్డాయి. అయితే రతన్ టాటా మరణంతో టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఎవరిని ఎన్నుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ట్రస్ట్ బోర్డులో ప్రముఖ ట్రస్టీలు ట్రస్ట్ వైస్ చైర్మన్ అయిన TVS పారిశ్రామికవేత్త వేణు శ్రీనివాసన్ మరియు మాజీ రక్షణ కార్యదర్శి విజయ్ సింగ్ ఉన్నారు.
నోయల్ టాటా
వేణు శ్రీనివాసన్ మరియు మాజీ రక్షణ కార్యదర్శి విజయ్ సింగ్ ఈ ఇద్దరూ 2018 నుండి టాటా ట్రస్ట్ పాలనలో పాలుపంచుకున్నారు. అయితే వీరికి అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు అంతంత మాత్రమే. మరో ట్రస్టీ, రతన్ టాటా సవతి సోదరుడు, ట్రెంట్ చైర్మన్ నోయెల్ టాటాను వారసుడిగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. 67 ఏళ్ల నోయెల్‌ను నియమించడం వల్ల పార్సీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు టాటా కుటుంబ సభ్యులు అధికారాన్ని నిలుపుకునే అవకాశముంది. టాటా గ్రూప్‌లో నాలుగు దశాబ్దాలకు పైగా గడిపిన ఆ అనుభవం కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తుంది.
నోయెల్ టాటా 2019లో సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీగా చేరారు. తరువాత 2022లో, సర్ దొరాబ్జీ కూడా ట్రస్ట్ బోర్డ్‌లో నియమితులయ్యారు. ఈ రెండు ట్రస్ట్‌లలోకి అతని ప్రవేశ అనుభవమే ఇప్పుడు అతనికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పడానికి ఉపయోగపడవచ్చు అని చర్చలు జరుగుతున్నాయి. అదే నిజమైతే, అతను సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ ఛైర్మన్‌గా మరియు సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు 6వ ఛైర్మన్‌గా వారసత్వాన్ని కొనసాగించనున్నారు.
రతన్ టాటా చివరి కోరిక
తదుపరి నాయకుడిగా నోయెల్ టాటా ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ 13 మంది ధర్మకర్తల బోర్డు ఏకాభిప్రాయంతో తుది నిర్ణయం తీసుకుంటుంది. రతన్ టాటా సన్నిహితుడు మెహ్లీ మిస్త్రీ మరియు వారసత్వ సమస్యలపై రతన్ టాటాకు సలహా ఇచ్చిన సీనియర్ న్యాయవాది డారియస్ ఖంబటా వంటి ప్రభావశీలులు కూడా ఇందులో పాల్గొంటారు. రతన్ టాటా వ్యక్తిగత కోరికలు ఇక్కడ పరిగణించబడతాయి, ట్రస్ట్ యొక్క భవిష్యత్తు కోసం టాటా సన్స్‌తో దాని సంబంధాలను రూపొందించే కొత్త ఛైర్మన్‌ను నియమించాలనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. అన్నింటికి మించి టాటా గ్రూప్ యొక్క వాణిజ్య ప్రయోజనాలతో పాటు టాటా చే నిర్వహించే సేవా కార్యకలాపాలను సమతుల్యం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాల్సిన అవసరముంది.
అయితే ఇప్పటి వరకైతే నోయల్ టాటా పేరే అంతటా వినిపిస్తోంది. ఆయన ఇప్పటికే కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు నోయెల్ టాటా పిల్లలు లేహ్, మాయ మరియు నెవిల్లే భవిష్యత్ తరానికి నాయకులుగా ఎదిగే అవకాశం ఉంది. వీరు ఇప్పటికే టాటా గ్రూప్‌లో పలు బాధ్యతలు నిర్వర్తిస్తూరు.
లేహ్ టాటా, మాయా టాటా
పెద్ద కుమార్తె, లేహ్ టాటా, స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని EI బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్‌లో డిగ్రీ అందుకున్నారు. 2006లో టాటా గ్రూప్‌లో తాజ్ హోటల్స్ రిసార్ట్స్ మరియు ప్యాలెస్‌ల అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా చేరారు. ప్రస్తుతం ది ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL)లో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. చిన్న కుమార్తె మాయ టాటా టాటా గ్రూపుకు చెందిన ఆర్థిక సేవల సంస్థ అయిన టాటా క్యాపిటల్‌లో విశ్లేషకురాలిగా తన వృత్తిని ప్రారంభించారు. బేయెస్ బిజినెస్ స్కూల్ మరియు వార్విక్ యూనివర్శిటీలో చదువుకున్న మాయ టాటా ఆపర్చునిటీస్ మరియు టాటా డిజిటల్‌లో కూడా పనిచేశారు. గ్రూప్ యొక్క సూపర్ యాప్ టాటా నియోను రూపొందించడంలో మాయ కీలక పాత్ర పోషించింది.