హస్తినలో బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కాస్త ఆలస్యం కానుంది. ఎన్నికల సంప్రదాయం ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ ప్రకటించకుండానే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది.దీంతో ఇప్పుడు ఢిల్లీ పీఠంపై ఎవరిని కూర్చోబెడతారనే చర్చ సాగుతోంది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ ఎన్నికల్లో మట్టి కరిపించిన బీజేపీ అభ్యర్ధి పర్వేష్ వర్మ వైపే అందరి చూపు ఉంది.
దీనికి ఊతమిచ్చినట్లుగానే ఆయన ఫలితాలు వెల్లడైన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మతో పాటు మరికొంత మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీ సీఎం ఆతిశీపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన బీజేపీ ఫైర్ బ్రాండ్ రమేష్ బిధూరీ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీకి కాబోయే కొత్త సీఎం ఎవరనే విషయంపై ఫోకస్ పెట్టిన బీజేపీ పెద్దలు.. అది నిర్ణయించడానికి ఒకట్రెండు రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అమిత్ షా, జేపీ నడ్డాతో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. మరోవైపు..ఈరోజు నుంచి ప్రధాని మోదీ 3 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళుతున్నారు.
దీంతో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మోదీ విదేశీ పర్యటన పూర్తి అయిన తర్వాతే నిర్వహించేలా బీజేపీ అధిష్టానం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ గడ్డపై 27 ఏళ్ల తర్వాత కాషాయ జెండా ఎగురనుండటంతో.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
మరోవైపు..ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా కూడా.. ఆయనతోపాటు రమేష్ బిధూరీ, బన్సూరీ స్వరాజ్, స్మృతి ఇరానీ సహా పలువురి పేర్లు కూడా బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ సీఎం పదవి ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.