తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొత్తగా పెళ్లయిన జంటలను త్వరగా పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. నాగపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల సీట్లు తగ్గించే అవకాశం ఉందని, ఇది అన్యాయమని విమర్శించారు.
“ఇప్పటిదాకా మేం కుటుంబ నియంత్రణపై ఫోకస్ చేశాం, ఇక నుంచి జనాభా పెంపుపై దృష్టిపెడతాం,” అని స్టాలిన్ తెలిపారు. కొత్తగా పెళ్లయిన దంపతులు త్వరగా పిల్లలను కనాలని, వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశాన్ని స్టాలిన్ ఏర్పాటు చేశారు. ఇందులో 40కి పైగా రాజకీయ పార్టీలను పాల్గొనాలని ఆహ్వానించారు. 2026లో జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రతీ రాష్ట్రానికి 8 నియోజకవర్గాలు తగ్గుతాయని ఆయన తెలిపారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చరిత్ర:
1951లో 494 లోక్‌సభ సీట్లు ఉండగా, ఒక్కో నియోజకవర్గానికి 7.3 లక్షల జనాభా ఉండేది. 1971 నాటికి 543 సీట్లు ఏర్పడ్డాయి, ఒక్కో నియోజకవర్గానికి 10.1 లక్షల జనాభా ఉండేది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పునర్విభజనను 2000 వరకు ఫ్రీజ్ చేశారు. 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా మరో 25 ఏళ్ల పాటు (2026 వరకు) పునర్విభజనను నిలిపివేశారు. 2026లో ఈ గడువు ముగియనుండటంతో, జనాభా ఆధారంగా కొత్త నియోజకవర్గాల విభజనపై తీవ్ర చర్చ జరుగుతోంది.