కేరళలోని వయనాడ్ జిల్లాలోని ముండక్కై, చురల్‌మల, నూల్‌పాలా, అట్టమల గ్రామాల్లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 300 దాటింది. ఇంకా 240 మందికి పైగా గల్లంతయ్యారు మరియు రెస్క్యూ బృందాలు వారి కోసం వెతుకుతూనే ఉన్నాయి. వాయనాడ్ లో పర్యటించిన లోక్‌సభ విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ. వాయనాడ్‌లోని సెయింట్ జోసెఫ్ యూపీ స్కూల్‌లోని పునరావాస శిబిరాలను సందర్శించి బాధితులను ఓదార్చారు. అంతకుముందు విపత్తు ప్రభావిత ప్రాంతమైన చురల్‌మలలో సైనికులు నిర్మించిన తాత్కాలిక వంతెనను రాహుల్ సందర్శించి పరిశీలించారు.
తాను నిన్నటి నుంచి వయనాడ్‌లోనే ఉన్నానని, ఇది భయానక విషాద ఘటన అని తాము ఇక్కడ అధికారులతో సమావేశమై పరిస్ధితి సమీక్షిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎంతకు చేరవచ్చు, దెబ్బతిన్న గృహాల వివరాలు, నష్టాన్ని తగ్గించేందుకు, సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయడంపై తమ వ్యూహాన్ని అధికారులు తమకు వివరించారని రాహుల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ విపత్తుగా పరిగణించాలని రాహుల్ అన్నారు. ‘ఇప్పుడు రాజకీయాలకు సమయం కాదు. ఈ క్లిష్ట సమయంలో దేశం మొత్తం వాయనాడ్ ప్రజలకు అండగా నిలుస్తోంది. అందరం కలిసికట్టుగా పని చేయాలి’’ అని అన్నారు. తాము ఎలాంటి సాయం చేసేందుకైనా వెనుకాడమని, ఇక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తామని వివరించామని చెప్పారు.
కాంగ్రెస్ కుటుంబం ఇక్కడ 100కుపైగా ఇండ్లను బాధితులకు నిర్మించి ఇస్తుందని, ఇది బాధితులకు తాము ఇస్తున్న భరోసా అని రాహుల్ గాంధీ తెలిపారు. ఇంతటి విషాదాన్ని కేరళ ముందెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర సీఎంతో కలిసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. ఇది విషాదం నుంచి బయటపడేందుకు ప్రత్యేక వ్యూహంతో ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాలను వీలైనంత త్వరతగా చేపట్టాలన్నారు. ఇక అంతకుముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాద్ జిల్లాలో పర్యటించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో బాధిత కుటుంబాలను, స్ధానికులను కలిశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.