మహారాష్ట్రలో ఎక్కడ చూసినా అసెంబ్లీ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ , నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ గెలుపు కోసం విసృతంగా ప్రచారం నిర్వహిస్తూ స్పీడ్‌ను పెంచాయి.
ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. గెలుపు గుర్రాలనే బరిలో దించడానికి రాజకీయ పార్టీలన్నీ భావిస్తున్నాయి. 288 సీట్లున్న మహారాష్ట అసెంబ్లీలో 145 సీట్లు మెజార్టీ తప్పనిసరిగా రావాల్సి ఉంది.
2019లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే..అక్కడి ప్రజలు అప్పుడు ఏ పార్టీకి అండగా నిలవలేదు. దీంతోనే అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ 105 సీట్లు సాధించడంతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక శివసేన పార్టీ -56 , ఎన్సీపీ – 54, కాంగ్రెస్ పార్టీ – 44 సీట్లు సాధించాయి. అయితే మహరాష్ట్రాలో అధికారం చేపట్టడం కోసం శివసేన ,ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి..ఉద్ధవ్ థాకరేను ఉమ్మడి సీఎంగా ఎంపిక చేశాయి.
అయితే కొద్ది కాలానికే మహారాష్ట్ర రాజకీయాల్లో అనుకోని మార్పులు చోటు చేసుకున్నాయి. శివసేన , ఎన్సీపీ పార్టీల్లో విభేదాలు చోటు చేసుకోవడంతో… శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే ,ఎన్‌సీపీ అజిత్ పవార్.. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపారు. దీంతో ఒక్కసారే ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయింది. అయితే శివసేన పార్టీ, గుర్తు తమదేనని ఏక్‌నాథ్ షిండే కోర్టుకు వెళ్లడం, షిండేకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో.. ఉద్ధవ్ థాకరే రాజకీయ నిరాశ్రయులు అయ్యారు.
దీంతో ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఉద్ధవ్ థాకరేకు డూ ఆర్ డై రాజకీయాలేనని చెప్పాలి. గతంలో తన తండ్రి స్థాపించిన పార్టీతో పాటు, ఆ పార్టీ గుర్తును కూడా ఉద్ధవ్ థాకరే పోగొట్టుకోవడం అప్పట్లో అతనికి కోలుకోలేని దెబ్బగానే చెప్పాలి. దీంతో ఇప్పుడు కామన్ సింబల్‌తో పోటీ చేయడానికి ఉద్ధవ్ థాకరే రెడీ అవుతున్నారు. అయితే ఎటువంటి గుర్తు లేకపోయినా కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో.. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి గట్టి షాక్ ఇస్తూ ఉద్ధవ్ థాకరే యొక్క సేన ముంబైలో గణనీయమైన విజయాన్ని సాధించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.
పార్టీ పేరు, గుర్తును కోల్పోయినా కూడా, బాల్ థాకరే వారసత్వానికి అతని వాదనను బలపరిచి, నాలుగు స్థానాలకు మూడు స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆ జోష్ తోనే ఉద్ధవ్ థాకరే రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. శివసేన పార్టీ, గుర్తు రెండు కోల్పోవడం ఉద్ధవ్ థాకరే మైనస్‌గా భావించి వెనుకడుగు వేస్తారని అంతా భావిస్తుండగా..ఆ అంశాలనే తనకు అనుకూలంగా మార్చుకుని మహారాష్ట్ర ఎన్నికలకు రెడీ అవుతున్నారు. మరి అక్కడి ఓటర్లు ఉద్ధవ్ థాకరేకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తారో చూడాలి.