
ప్రపంచాన్ని మళ్లీ మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతోంది. ఆఫ్రికాలో ఉప్పెనలా నమోదు అవుతున్న కేసుల వల్ల తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ”గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ”గా ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి టెర్రర్ మొదలయింది.
రెండేళ్లలో రెండోసారి డబ్ల్యూహెచ్ఓ..ఇలా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటికే ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. గురువారం రాత్రి వరకూ 548 మంది ఎంపాక్స్ వైరస్ వల్ల ఆ దేశంలో మరణించినట్లు అధికారికల లెక్కలలో తేలాయి.అలాగే 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
అంతేకాకుండా ఆఫ్రికాలో ఇతర దేశాలకు కూడా ఎంపాక్స్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా క్లోజ్ కాంటాక్ట్ ద్వారా స్వీడన్‌లో తొలి ఎంపాక్స్ కేసు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు. స్వీడన్‌లో క్లాడ్-1 అనే అత్యంత తీవ్రమైన మంకీపాక్స్ కేసును గుర్తించి దానిని ధృవీకరించినట్లు ఆరోగ్య సామాజిక వ్యవహారాల మంత్రి జాకోబ్ ఫోర్స్‌మెడ్ వెల్లడించారు.
రెండేళ్ల క్రితం యూరప్ మొత్తం ఎంపాక్స్ కేసులు నమోదయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ వైరస్ స్వలింగ సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. 2022లో 100కు పైగా దేశాల్లో 70వేల కన్నా ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. యూరప్‌లోని పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించింది. 2022 మే నెలలో బ్రిటన్ లో మొదటిసారిగా మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది.
మెల్లమెల్లగా యూరప్ లోని చాలా దేశాల్లో ఎంపాక్స్ వైరస్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా లెక్కలు వేస్తే అమెరికా, యూరప్ దేశాల్లోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. బ్రిటన్, అమెరికాతో పాటు బెల్జియం, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కేసుల సంఖ్య పెరిగి అక్కడివారిని ఎక్కువగా ప్రభావితం చేశాయి. అయితే అప్పుడు భారత్ లో కూడా కొన్ని కేసులు నమోదు అవడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయి మొత్తానికి అదుపులోకి తీసుకువచ్చారు.కానీ మరోసారి డబ్ల్యూహెచ్ఓ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలయింది.