ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా ఘనంగా జరుగుతోంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ పవిత్ర మేళాలో పాల్గొనేందుకు కోట్లాది భక్తులు దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంత పెద్ద స్థాయిలో భక్తుల రాకతో స్థానిక వ్యాపారాలు కళకళలాడుతున్నాయి. చిన్నచిన్న ఉద్యోగాలు, తాత్కాలిక వ్యాపారాల ద్వారా వేలాది మంది ఆదాయం పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఓ యువకుడు తన సృజనాత్మక ఆలోచనతో ప్రత్యేకంగా నిలిచాడు. అతను మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సేవలను అందిస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ రోజుల్లో ఫోన్ అవసరం ఎంత ముఖ్యమో చెప్పక్కర్లేదు. కానీ కుంభ మేళాలో లక్షల మంది భక్తులు ఉండటంతో ఫోన్ ఛార్జింగ్ పెద్ద సమస్యగా మారింది. ఈ అవకాశాన్ని గమనించిన ఓ కుర్రాడు, ప్రత్యేకంగా మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేశాడు.
అతను ఓసారి 25 ఫోన్లను ఛార్జింగ్ చేసేలా సాకెట్‌లు ఏర్పాటు చేశాడు. ఒక్క ఫోన్‌కు గంట ఛార్జింగ్ పెట్టినందుకు రూ.50 వసూలు చేస్తున్నాడు. దీంతో గంటకు కనీసం రూ.1000 ఆదాయం వస్తోంది. రోజుకు 12 గంటల పాటు ఈ సేవలను అందిస్తూ, రోజుకు పన్నెండు వేల రూపాయలకుపైగా లాభం పొందుతున్నాడు. అతని ఆలోచనను నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.
@malaram_yadav_alampur01 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది. కుంభ మేళా పుణ్యమా అని, అతని వినూత్న ఆలోచన బలమా అని, ఈ కుర్రాడు తనకోసమే కాదు, మరికొంత మందికి ఉపాధిని కల్పించేలా మారాడు. అతని జాగ్రత్తైన వ్యాపారతత్వం, సమయస్ఫూర్తి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
View this post on Instagram