తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో అత్యంత ఘనంగా నిర్వహించనుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 27వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు.
గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గో సంరక్షణ శాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 5 నుండి 10.30 గంటల వేణుగానం, తిరుమల వేదపాఠశాల విద్యార్థులచే వేద పారాయణం, తరువాత టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గో పూజ, వేణుగోపాలస్వామి హారతి నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఆగస్టు 28న ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకు మలయప్ప స్వామి వారిని బంగారు తిరుచ్చిపై, కృష్ణస్వామివారిని మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగింపు ఉంటుందని వివరించారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 28న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.