తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇటీవల కోడి మాంసం ధరలు భారీగా పడిపోతుండటంతో వినియోగదారులు ఇది శుభవార్తగా భావించినా, అసలు కారణం మాత్రం ఆందోళనకరంగా మారింది. పౌల్ట్రీ పరిశ్రమను ఒక అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ ప్రభావంతో కోళ్లు ఊహించని రీతిలో మరణిస్తుండటంతో రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు.
గత వారం రోజుల క్రితం వరకు రూ.220 పైన ఉన్న చికెన్ ధరలు గురువారం నాటికి స్కిన్‌లెస్ రూ.195-206కి, విత్ స్కిన్ రూ.180-190కి తగ్గాయి. అయితే ధరలు తగ్గడానికి ప్రధాన కారణం హెచ్5ఎన్1 వైరస్ అని తెలుస్తోంది. కోళ్లు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, అనూహ్యంగా మరణిస్తుండటం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
భయపెట్టే వైరస్ ప్రభావం!
ఉభయ గోదావరి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఈ వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. పౌల్ట్రీ ఫారాల వద్ద చనిపోయిన కోళ్లు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఒక్కసారిగా చనిపోవడంతో రైతులు గందరగోళంలో ఉన్నారు. గత 15 రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో 40 లక్షల కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. తెలంగాణలోని ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో రోజుకు పది వేల కోళ్లు చనిపోతుండడం కలవరపెడుతోంది.
సాధారణంగా పౌల్ట్రీ ఫారాల్లో రోజుకు 0.05% కోళ్లు అనారోగ్య కారణాలతో మరణించడం సహజం. కానీ, ప్రస్తుత స్థితిలో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు.
పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతినే ప్రమాదం!
ఈ వైరస్ ప్రభావంతో కోడిగుడ్ల ఎగుమతులు కూడా తీవ్రంగా పడిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల నుంచి రోజూ 40కి పైగా లారీల కోడిగుడ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 25కి పడిపోవడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ వార్తలు ప్రజలకు తెలియడంతో చాలామంది చికెన్ తినడం మానేశారు. డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విస్తరించిందని రైతులు చెబుతున్నారు. వ్యాక్సిన్ ఇచ్చినా ఫలితం లేకపోవడం సమస్యను మరింత తీవ్రమిచ్చింది.
భవిష్యత్తుపై ఆందోళన..
వైరస్ సోకిన కోళ్ల నమూనాలను ల్యాబ్ పరీక్షల కోసం భోపాల్‌కు పంపించారు. భోపాల్ నివేదిక రాగానే అసలు వైరస్ ప్రేరేపించిన కారణాలు స్పష్టంగా తెలుస్తాయి. గతంలో 2012, 2020లో ఇలాంటి వైరస్ ప్రబలినప్పుడు లక్షలాది కోళ్లు చనిపోయిన ఘటనలు గుర్తుండే ఉంటాయి. అయితే, ఈసారి వైరస్ మరింత ప్రమాదకరంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పౌల్ట్రీ రైతులు ప్రభుత్వాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని, వైరస్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే పౌల్ట్రీ పరిశ్రమకు గండిపడే అవకాశముందని, దీని ప్రభావం భవిష్యత్తులో చికెన్ మరియు కోడిగుడ్ల లభ్యత, ధరలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందితే తెలుగు రాష్ట్రాల్లో మాంసాహారం ప్రియులు చికెన్ లభ్యతలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి నెలకొనవచ్చు!