శీతాకాలం వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్పస్వామి మాలను ధరిస్తుంటారు. తమ మొక్కులు తీర్చుకోవడానికి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి వస్తుంటారు.అయితే రైళ్లలో శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే శాఖ కీలక సూచనలు చేసింది. రైళ్లలో ఏ స్వామి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, ముఖ్యంగా కర్ఫూరం వెలిగించవద్దని సూచించింది.
అయ్యప్ప స్వామికి చేసే పూజా విధానంలో భాగంగా కర్పూరం, అగరబత్తీ, సాంబ్రాణి పుల్లలు వెలిగించడం వంటివి చేస్తున్నారని రైల్వే అధికారుల దృష్టికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో.. రైళ్లలో ఇలాంటి పనులు చేయవద్దని స్వాములకు విజ్ఞప్తి చేసింది.
మండే స్వభావం గల పదార్థాలతో రైళ్లలో ప్రయాణం చేయడాన్ని, వాటిని వెలిగించడాన్ని నిషేధించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
మండే స్వభావం ఉన్న పదార్థాలను వెలిగిస్తే.. రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని..దీనివల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో పాటు ఆర్థికంగా కూడా భారీ నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రైల్వే ఆస్తులకు కూడా భారీగా నష్టం కలిగించే అవకాశం ఉండటంతో.. ఇలాంటి వారిపై రైల్వే చట్టం-1989 ప్రకారం శిక్షార్హులని రైల్వే శాఖ అధికారులు చెప్పారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే యాత్రికులకు తాజాగా దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఏపీ మీదుగా ఏకంగా 62 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. శబరిమలకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.