ఎస్‌బీఐ ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం.. వినియోగదారుల అసహనం

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మళ్లీ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోంది. బ్యాంకింగ్ సేవల్లో కీలకమైన యూపీఐ (UPI) లావాదేవీలు నిలిచిపోయాయి, దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల, బ్యాంక్ సేవలు క్రమం తప్పకుండా అంతరాయానికి గురవుతుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కూడా ఇదే సమస్య తలెత్తగా, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యిందని భావించిన కస్టమర్లు, మరోసారి అదే ఇబ్బందిని ఎదుర్కొనడం తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ముఖ్యంగా, అత్యవసర లావాదేవీల కోసం యూపీఐ ఆధారపడే వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

తరచూ సాంకేతిక సమస్యలు 

ఎస్బీఐ అనేకమంది ప్రజలకు ప్రధానమైన బ్యాంకింగ్ సేవలందించే సంస్థ. అయితే, తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో, వినియోగదారుల నమ్మకం తగ్గిపోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడం వంటి అంశాలు, బ్యాంక్ ఇమేజ్‌కు దెబ్బతీసే అవకాశముందని చెబుతున్నారు.

ఈ సమస్యలపై ఎస్బీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో పునరావృతమవుతున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఎస్బీఐ కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. నిరంతర సేవలు అందించాలంటే, సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరచడం అనివార్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే, ఎస్బీఐ తక్షణమే సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో, ఇటువంటి అంతరాయాలు తక్కువగా ఉండేలా బ్యాంక్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.