దసరా శరన్నవరాత్రుల ప్రభావమో..దిగుబడి తక్కువ అవడమో కారణం ఏదైనా కానీ.. కొద్ది రోజులుగా టమాట, ఉల్లి ధరలు సామాన్యుడికి అందను అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నెల రోజుల నుంచి టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. నెలన్నర క్రితం వరకు కిలో టమోట 20 నుంచి 30 రూపాయలు పలికిన అదే ఇప్పుడు టమాటా ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ఆవైపు కూడా చూడటం లేదు.
ఈ పదిహేను రోజుల్లోనే టమాటా ధర డబుల్ అయిపోయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్‌లో కిలో టమాటా 70 నుంచి 80 రూపాయలు పలుకుతోన్న టమోట.. రిటైల్ అయితే 100 క్రాస్ చేసేసింది. డిమాండ్‌కు సరిపడా టమాటా రాకపోవడమే దీనికి కారణమని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు . ఇటీవల కురిసిన అనుకోకుండా భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతిన్నాయి. దీంతోనే టమాట ధరలు అమాంతం పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ మార్కెట్‌కు వచ్చే టమాటాలు.. తెలంగాణలోని జిల్లాల నుంచే కాకుండా రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వస్తాయి. వర్షాల ప్రభావంతో ఇతర రాష్ట్రాల నుంచి టమాట రాక తగ్గడంతో పాటు..తెలంగాణలో కూడా దిగుబడి తగ్గటంతో టమాట ధరలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. సాధారణంగా టమాటా ధర వేసవి కాలంలోనే కాస్త ఎక్కువగా ఉండి.. ఈ సమయంలో ధర తక్కువగా ఉండాలి.
భారీ వర్షాలతో దిగుబడి తగ్గడంతో అదే సమయంలో శరన్నవరాత్రుల సందర్బంగా కూరగాయలు తినేవాళ్లు ఎక్కువ అవడంతో టమాటకు డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులుచెబుతున్నారు. ఇవే ధరలు మరో నెల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు . అంటే కొత్త పంట చేతికి వచ్చే వరకు ఇవే ధరలు ఉంటాయని చెబుతున్నారు.
మరోవైపు ఉల్లి ధరలు కూడా భారీగానే పెరిగాయి. రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి గడ్డ 60 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. కేంద్రం ఉల్లి ఎగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ధరలు భారీగా పెరిగినట్లు అంచనాలున్నాయి. ఐతే సామాన్యులపై ఉల్లి భారాన్ని తగ్గించడానికి కేంద్రం బఫర్ స్టాక్‌ను రిలీజ్ చేసింది. అలాగే నాఫెడ్ ద్వారా 35 రూపాయలకే కిలో ఉల్లిని విక్రయిస్తోంది.
ఇక, ఉల్లితో పాటు వెల్లుల్లి ధర కూడా భారీగానే పెరిగింది. మంచి క్వాలిటీ ఉన్న వెల్లుల్లి కిలో 500 రూపాయలు పలుకుతోంది. ఇక మిగతా కూరగాయల ధరలు కూడా భారీగానే పెరుగుతూ వస్తుంది. ఇటు స్కిన్ లెస్ చికెన్ కిలో 300లకు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. కోడి గుడ్ల ధరలు కూడా పెరిగాయి.సాధారణంగా చికెన్ రేటు తగ్గితే వెజిటబుల్స్ ధర పెరగడం.. వెజిటబుల్స్ ధర పెరిగితే చికెన్ రేటు తగ్గడం జరుగుతాయి. కానీ ఇప్పుడు రెండూ పోటీపడుతున్నాయి.