టమాటాలను రైతులు అమ్మ బోతే అడవిగా.. అదే టమాటను వినియోగదారులు కొనబోతే కొరివి అన్నట్లుగా ధరలు ఉంటున్నాయి. మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వరకు కూడా ఎక్కడ చూసినా టమాటా విస్తారంగానే పండుతుంది. అయితే వంటింటిలో మస్ట్ వెజిటబుల్ అయిన టమాట రోజుకో ధరతో సామాన్యులకు నిత్యం చుక్కలు చూపిస్తూనే ఉంటుంది.ఒక సారి కేజీ 10 రూపాయలకే దొరికే టమాటలు.. వచ్చే వారం 200 రూపాయలు అయిన రోజులు కూడా ఉన్నాయి.
మొన్నటివరకు టమాట పంట ద్వారా రైతులు లాభాలను చూశారు. అయితే ప్రస్తుతం టమాటా ధర కిలో రూపాయికి పడిపోయింది. ఇలా ఒక్కసారిగా ధర పతనమవడంతో టమాటా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని టమాట పంటకు పేరు పొందిన ప్రాంతాలుగా పత్తికొండ, మదనపల్లిలో కేజీ టమాటా ధర రూపాయికి పడిపోయింది. గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో.. రైతులు తాము పండించిన టమాటాలను రోడ్ల పక్కన పారబోసేస్తున్నారు.
టమాటా పంటను కోసేందుకు వచ్చిన కూలీల ఖర్చు కూడా టమాట ఇప్పుడు రాబట్టలేకపోతుంది. దీంతో రవాణా ఖర్చులయినా మిగిలే అవకాశం లేకపోవడంతో పండిన పంటనంతా రోడ్ల పక్కన పడేసి కన్నీరుమున్నీరవుతున్నారు. తమ దగ్గర పంట లేనప్పుడు మాత్రం టమాట ధర రాకెట్ లాగా పెరుగుతుందని..తమ దగ్గర పంట ఉన్నప్పుడు ధర ఇలా నేల చూపులు చూస్తుందని రైతులు వాపోతున్నారు. అందువల్లే ఇప్పుడు తమ పంటను అమ్మడం కంటే.. ఇలా రోడ్ల పక్కన పారబోస్తే వాటిని పశువులయినా తింటాయని అంటున్నారు.
అయితే ఏపీలో చాలా ప్రాంతాలలో కేజీ రూపాయి మాత్రమే పలుకుతున్న టమాటా ధరలు.. హైదరాబాదు వంటి ఏరియాలలో కిలో 30 నుంచి 40 రూపాయల వరకు పలుకుతోంది. సెప్టెంబర్ , నవంబర్, డిసెంబర్ తొలి వారంలో అయితే టమాటా కిలో 70 రూపాయల వరకు కూడా చేరుకుంది. అయితే ఏపీలో రూపాయి మాత్రమే పలుకుతున్న టమాటా ధరలు.. హైదరాబాదు వంటి ప్రాంతాలకు వచ్చేసరికి 400 రెట్లు పెరుగుతూ కొనేవారికి మాత్రం ఎప్పటిలాగే చుక్కలు చూపిస్తున్నాయి.
ఇటు రైతులు, కొనేవాళ్లు నష్టపోతుందటే మధ్యలో వ్యాపారులు మాత్రం బాగానే లాభపడుతున్నారు. రవాణా ఖర్చులని, ఇతర ఖర్చులని చెప్పి టమాట ధరలను అమాంతం పెంచుతున్నారు. పండించిన రైతులు నష్టపోతుంటే..దళారులు, వ్యాపారులు మాత్రం కోట్లను గడిస్తున్నారు.