ఒకప్పుడు ఎవరి ఇంట్లో చూసినా నలుగురుకు తగ్గకుండా పిల్లలుండేవారు. కానీ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకరో ఇద్దరు అంతకు మించి కనిపించడం లేదు. పెంచడానికి కష్టం అవుతుందనో.. సంపాదన పరంగా ఆలోచించో ఒకరిద్దరితోనే సరిపెట్టుకుంటున్నారు. అందుకే వారిని అపురూపంగా పెంచుకుంటూ వారి అడిగిందల్లా కొనిపెడుతూ ఉంటారు.
ఒక్కోసారి పెద్దలు వద్దంటున్నా పిల్లలు మారాం చేసి మరీ కొనిపించుకుంటున్నారు. ఒకవేళ వారు కొనకపోయినా, వారి కోరిక కాదన్నా అలుగుతూ, ఏడుస్తూ నానా రచ్చ చేస్తుంటారు. అయితే ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మాన్పించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే భవిష్యత్‌లో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చచిస్తున్నారు.
వాళ్లు అడిగిన ప్రతీసారి పేరెంట్స్ ..తమ పిల్లలకు ఇవ్వడం అలవాటు చేస్తే, ఆ పద్ధతికే వారు అలవాటైపోతారని నిపుణులు చెబుతున్నారు. తాము అలిగినా, ఏడ్చినా కోరింది మాత్రం ఇస్తున్నారనే ఆలోచన వాళ్ల మెదడులో ముద్ర పడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వారికి సమస్యగా మారనుందని నిపుణులు అంటున్నారు.
కోరుకున్నది చేతికి అందకపోతే పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఏదైనా కావాలని పిల్లలు అడిగినప్పుడు అది నిజంగా వారికి అవసరమా.. కాదా అని పెద్దవాళ్లే ఆలోచించాలి. దాని వల్ల ఏదైనా ఉపయోగం ఉంటేనే కొనాలి.
కొందరు తల్లిదండ్రులు పిల్లలు అడిగివన్నీ తెచ్చివ్వడం గొప్పతనంగా ఫీల్ అవుతుంటారు. అలా చేయడం వల్ల పిల్లలకు ఆ వస్తువు విలువ, డబ్బులు విలువ తెలియదని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలు అడిగిందల్లా ఇస్తూ వారిని గారాబం చేస్తే.. భవిష్యత్‌లో మొండిగా ప్రవర్తిస్తారు. అందుకే వస్తువు అవసరం లేదనుకుంటే..దాన్ని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ కూడా పిల్లల కోరికలు తీర్చే తల్లిదండ్రులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.