బిజీబిజీ లైఫ్‌లో పడి చాలామందికి ఫుడ్ తినడానికి కూడా టైమ్ ఉండదు. కోటి విద్యలు కూటి కొరకే అన్న విషయాన్ని కూడా మరచిపోయి.. నాలుగు మెతుకులు హడావుడిగా తినేసి మమ అనిపించేస్తారు. అయితే భోజనాన్ని అలా హడావుడిగా కాకుండా మెల్లగా తినాలని లేదంటే అనర్ధాలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు.
ఆహారాన్ని గబగబా తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆహారం నమలకుండా తినడం వల్ల శరీరంలోకి వెళ్లిన తర్వాత.. జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆ ఆహారం అలాగే పొట్టలో ఉండగానే కొంతమంది నీరు తాగుతూ ఉంటారు. దీంతో ఆహారం జీర్ణం కావడానికి ఇంకా సమయం పడుతుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కాకుండా అలాగే ఉండిపోయి కొవ్వుగా పేరుకుపోతుంది. అందుకే ఆహారాన్ని నోటిలోని మెత్తగా నమిలి ఆ తర్వాత మింగాలి. ఆహారం నమిలి తినే సమయంలో నోటిలో ఉత్పత్పి అయ్యే లాలాజలం ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ బరువు సమస్యకు కూడా ప్రధాన కారణం గబగబా ఆహారాన్ని తినడమేనని డాక్టర్లు చెబుతున్నారు. ఆహారాన్ని స్పీడ్ గా తినడం వల్ల ఎంత తింటున్నారో తెలియకుండా ఎక్కువ తినేస్తారు కొంతమంది. దీనివల్ల ఒక ముద్ద ఆహారం లోపలికి వెళ్లిన తర్వాత మరో ముద్ద రాగానే అది అలాగే పేరుకు పోతుంది.మన మెదడు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఆపేయ్ అనే సంకేతాలు చెప్పేలోపే అప్పటికే పరిమితికి మించిన ఆహారాన్ని తీసుకుంటారు. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది జీర్ణం కాకుండానే మరోసారి కూడా టైమ్ అయిందని ఆహారాన్ని తీసుకోవడం వల్ల అదంతా అలాగే ఉండిపోయి కొవ్వుగా మారి బరువు పెరుగుతారు.
అంతేకాదు ఆహారాన్ని ఫాస్ట్ గా తినడం వల్ల మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. ఆహారాన్ని గబగబా తీసుకోవడం వల్ల చక్కెర నిల్వల స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆహారంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటంతో.. ఇది మితిమీరిపోయి రక్తంలో కలిసి పోయి డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశాలను పెంచుతాయి. అంతేకాకుండా త్వరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల పేగుల్లో ఇబ్బందికర వాతావరణం ఏర్పడి గ్యాస్ ట్రిక్ వంటివి ఏర్పడతాయి.