సీజన్ తో సంబంధం లేకుండా గ్యాస్,కడుపు ఉబ్బరం,కడుపు నొప్పి వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదని…టాబ్లెట్ ల జోలికి వెళ్లవలసిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన వంటింటిలో ఉండే కొన్ని దినుసులను ఉపయోగిస్తే ఆ సమస్యల నుంచి సులభంగా బయట పడొచ్చని అంటున్నారు.
జీలకర్ర జీర్ణ సమస్యలను తగ్గించటంలో బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పొయ్యి మీద ఒక గ్లాస్ నీటిని పెట్టి ఒక స్పూన్ జీలకర్ర వేసి 5 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి అయినా వడకట్టకుండా అయినా వారి వారి ఇష్టాన్ని బట్టి తాగొచ్చు. ఈ విధంగా సమస్య తీవ్రతను బట్టి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగితే వీటి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే జీలకర్రను వేయించి.. మెత్తని పొడిగా చేసుకొని నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. సమస్య ఉన్నప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ జీలకర్ర పొడిని కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే జీలకర్రలాగే వాము లేదా ఓమ కూడా జీర్ణ సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్వీకుల కాలం నుంచి వామును వాడుతున్నారు. గ్యాస్,కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు ఉన్నప్పుడు అరస్పూన్ వాములో ..చిటికెడు సాల్ట్ కలిపి నోట్లో వేసుకొని నములుతూ ఆ రెండింటి రసాన్ని మింగాలి. ఇలా చేస్తే వెంటనే గ్యాస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
అంతేకాదు అల్లం కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లంలో ఉండే జింజీరాల్ అనే సమ్మేళనం గ్యాస్, అజీర్తి వంటి కడపు సంబంధిత సమస్యలను తగ్గించటమే కాకుండా..బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడటంలో అల్లం బెస్ట్ మెడిసిన్ అని ఆయుర్వేదంలో చెబుతారు. ఒక గ్లాస్ నీటిలో అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మరిగించి వడకట్టి ఆ నీటిని తాగితే మంచిది.లేదా చిన్న అల్లం ముక్కను ,కొంచెం ఉప్పును తీసుకుని బాగా నమిలి ఆ రసాన్ని మింగితే ఫలితం ఉంటుంది.