రెండు తెలుగు రాష్ట్రాలలో పరీక్షల ఫీవర్ నడుస్తోంది. చాలామంది విద్యార్థులకు చదివింది మర్చిపోయామంటూ ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే రోజువారి తీసుకునే ఆహారంలో మన శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్ధాలతో పాటు మెదడు పనితీరుకు ఉపయోగపడే ఆహారపదార్ధాలను కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే మనం జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చని సూచిస్తున్నారు. దీనికోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో వివరిస్తున్నారు.
బాడీలో ఎప్పుడూ కూడా నీటిస్థాయి తగినంత ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడంతో పాటు మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు, ఫ్రూట్ జ్యూసులు తాగడం మంచిది. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలుండే వాల్‌నట్స్, చేపలు.. మొదలైన ఆహార పదార్థాలు జ్ఞాపకశక్తిని పెంచడంలో తోడ్పడతాయి. అలాగే ఈ ఆమ్లాలు మెదడులోని న్యూరోట్రాన్స్‌మిట్టర్స్ పనితీరును మెరుగుపరిచి మెదడుకు రక్షణనిస్తాయి.
మెమరీపవర్ని మరింత రెట్టింపు చేసుకోవాలంటే రోజుకో బైట్ చొప్పున డార్క్ చాక్లెట్ తినడం మంచిదే. ఇందులో ఉండే కెఫీన్ మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం..గుమ్మడి గింజల్లో ఉండే జింక్ మెదడు చురుకుగా పని చేసేలా చేస్తాయి.మోనోఅన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొవ్వుల స్థాయిలు తగ్గిపోతాయి. శరీర భాగాలన్నింటికీ రక్తప్రసరణ బాగా జరిగి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
వాల్‌నట్స్‌లో ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ బి6, మెగ్నీషియం.. మెదడును సురక్షితంగా ఉంచడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి.అంతేకాదు జ్ఞాపకశక్తిని పెంపొందించే గుణం టమోటాలకు ఎక్కువగా ఉంటుంది. వాటిలో ఉండే ‘లైకోపీన్’ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు కణజాలాల్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. రోజూ టమోటాల్ని ఆహారంలో భాగంగా తింటారో వారి మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ సహాయపడే పానీయం గ్రీన్ టీ. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజూ కనీసం రెండు, మూడు కప్పుల గ్రీన్‌టీ తాగితే అటు శరీర ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మంచిది.
చాలామంది యాపిల్స్‌పై ఉండే తొక్క తీసి తింటారు కానీ దాని తొక్క తొలగించకుండా తింటే జ్ఞాపకశక్తిని పెంచే క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరానికి అందుతుందట. అలాగే విటమిన్ సి అధికంగా లభించే నిమ్మ, దానిమ్మ.. వంటి వాటిని కూడా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తిని బాగా పెంచుకోవచ్చు. తేనె తీసుకోవటం ద్వారా అందులో ఉండే మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ బి.. మొదలైనవన్నీ మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. వీటితో పాటు తేనెలో ఉండే ఫ్రక్టోజ్ మెదడుకు ఇంధనంలా పని చేస్తుంది.
బాదంపప్పులో ఒమేగా-3, 6 ఫ్యాటీ ఆమ్లాలు, ‘బి6’, ‘ఇ’ విటమిన్లు ఎక్కువగా లభిస్తాయి కాబట్టి.. ఇవి కూడా జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి చక్కగా పని చేస్తాయి. కాబట్టి ఐదారు బాదం పప్పుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మెదడు చురుకుదనాన్ని పెంచే శక్తి పసుపుకి ఉందని పలు పరిశోధనల్లో తేలింది. దీనిలో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం అల్జీమర్స్ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. కాబట్టి దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.