దాంపత్య జీవితంలో సంతోషం లేకపోతే, అలాంటి సంబంధం త్వరగా విడిపోయే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రోజుల్లో దంపతుల మధ్య అపనమ్మకం పెరగడాన్ని మనం చూస్తున్నాం. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. కాని సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడాలంటే.. భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే గుణాలు కూడా ఉండాలి. ఈ గుణాలను కలిగిన ఉన్నా, లేదా ఈ మార్గాల్లో నడుచుకున్న వైవాహిక జీవితంలో గొడవలు లేకుండా ముందుకు వెళ్లవచ్చు. మరి సంతోషకరమైన వైవాహిక జీవితానికి దోహదపడే ఆ నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గౌరవం: వివాహం జీవితంలో భార్యాభర్తలు పరస్పర గౌరవంతో నడుచుకోవాలి. ఒకరి ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. పరస్పర ప్రశంసలు, అవగాహనను కలిగి ఉండాలి. ఇవే మీ వైవాహిక జీవితాన్ని సంతోషకరంగా చేయగలవు. భార్య భర్తకి లోకువ కాదు. భర్త భార్యకి లోకువ కాదు అన్న సత్యాన్ని సదా గుర్తెరిగి ఉంటే ఇద్దరూ సంతోషంగా ఉంటారు.
నమ్మకం: నిజాయితీ: విశ్వాసం అనేది వివాహ జీవితం సాఫీగా సాగడానికి కావలసిన ఇంధనం వంటిదని చాణక్యుడు చెప్పాడు. అయితే నిజాయితీగా ఉండడం ద్వారానే జీవిత భాగస్వామి తన పార్ట్నర్పై విశ్వాసం చూపగలదు, అందుకోసం చేసే చిన్న చిన్న వాగ్దానాలు, కట్టుబాట్లను కూడా నిలబెట్టుకోవాలని. ఇవి దాంపత్య జీవితంలో ప్రేమను రెట్టింపు చేస్తాయి.
కుటుంబం: కుటుంబంలో ఐక్యత, కలిసి ఉండాలనే భావాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని మీరు ఎప్పుడు కల్పించండి. కుటుంబ సభ్యులతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి, భాగస్వామ్యులతో కలిసి వివిధ కార్యకలాపాలలో పాల్గొనే వాతావరణాన్ని కల్పించండి. అంతేకాదు విజయాలు, కెరీర్ లో మైలు రాళ్లను ఫ్యామిలీ సభ్యులు అందరు కలిసి సమిష్టి గా జరుపుకునే విధంగా ప్రోత్సహించండి. ఇది కుటుంబ సంబంధాలను బలపరచడమే కాదు మీ భాగస్వామికి మరింత ఉత్సాహాన్ని కల్పిస్తుంది.
క్షమాపణ: ఎలాంటి విషయంలోనైనా ఒకరిపై మరొకరు పూర్తి నమ్మకంతో ముందుకు సాగడం, ఎప్పుడైనా గొడవపడ్డా, ఆ వెంటనే తప్పు తెలుసుకొని సారీ చెప్పడం, ఎదుటి వారిని క్షమించగలగడం.. వంటివి కూడా దంపతులు అలవాటు చేసుకోవడం ముఖ్యం.
విహారయాత్రలు: ఇంట్లో అయినా, బయటికి వెళ్లినా వీలైనంత వరకు ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవడం, కనీసం పదిహేను రోజులకోసారైనా దగ్గరగా ఉండే బయటి ప్రదేశాల్ని చుట్టి రావడం.. వంటివి చేయాలి.
అలవాట్లు: భార్యాభర్తలిద్దరికీ వ్యాయామం చేయడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం వంటి అలవాట్లున్నాయనుకోండి.. ఇలాంటి వాటిని వారు అలాగే కొనసాగిస్తూ.. ఆయా పనులు ఇద్దరూ కలిసి చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇద్దరూ కలిసి ఇలాంటివి ఒకేసారి చేయడం వల్ల బోలెడంత ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇలాంటి ఉమ్మడి అలవాట్ల వల్ల ఇద్దరూ కలిసి గడిపే సమయం పెరుగుతుంది. తద్వారా ఇద్దరి మధ్య అనుబంధం పదింతలవుతుంది.