ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది ప్రతీ ఒక్కరిలోనూ దాదాపుగా కనిపిస్తోంది. ఇది సైలెంట్ కిల్లర్ అని అంటున్న డాక్టర్లు దీనిపై దృష్టి పెట్టకపోతే మున్ముందు ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మధుమేహం వచ్చిన తర్వాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోతే, శరీరం మెల్లగా బలహీనపడుతుంది.
జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నా కూడా, ఆహారపుటలవాట్లు కూడా దీనికి కారణమేనని అంటున్నారు. చాలామంది దీనిని గుర్తించడంలో లేటు చేస్తుంటారు. కానీ ఉదయాన్నే కనిపించే కొన్ని లక్షణాలతో రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందని అర్థం చేసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు, ఉదయం నిద్ర నుంచి లేచిన తర్వాత వికారంగా అనిపిస్తుంది. ఈ వికారంగా ఉండే లక్షణాలే మధుమేహానికి పెద్ద సంకేతం అని వైద్యులు చెబుతున్నారు. ఇది కాస్తా ముదిరి వాంతులు చేసుకోవడం, నీరసం వంటివి ప్రారంభమైతే మాత్రం కచ్చితంగా గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవాలి.
అంతేకాకుండా చాలా మందికి నిద్ర నుంచి లేచిన తర్వాత అస్పష్టమైన దృష్టిని కలిగి ఉంటారు. అంటే కళ్లు సరిగా కనిపించవు.. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయికి హెచ్చరిక సంకేతమే. నిజానికి మధుమేహం వల్ల, కళ్ల లెన్స్ పెద్దదిగా మారడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో తక్కువ దృష్టి మందగిస్తుంది. వెంటనే పరీక్షలు చేయించుకుని శరీరంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తే.. మళ్లీ కంటి చూపు మెరుగుపడుతుంది.
అలాగే డయాబెటిక్ పేషెంట్లకే ప్రారంభంలో ఉదయం నిద్ర లేవగానే నోరు పొడిబారినట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాగే పొద్దున లేవగానే ఎక్కువగా దాహం వేసినట్లు అనిపించినా కూడా వెంటనే మీ రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకోవాలి. ఇది మధుమేహవ్యాధిలో ప్రమాదకరమైన సంకేతం అని డాక్టర్లు చెబుతున్నారు
అయితే ఉదయం లేచిన వెంటనే కనిపించే ఆ లక్షణాలతో పాటు.. కొన్ని ఇతర సంకేతాలు కూడా వారిలో కనిపిస్తాయి. అలసట పెరగడం, చేతులు-కాళ్లు తిమ్మిరి, మూర్ఛ వంటివి కూడా డయాబెటిస్ వ్యాధి ఉన్నవారిలో కనిపించే లక్షణాలు. ఇవి తరచూ కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.