బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ జట్టు ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో యువ భారత జట్టు బరిలోకి దిగనుంది. ఐపీఎల్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి అందరి దృష్టిని ఆకర్షించిన 22 ఏళ్ల మయాంక్ యాదవ్ ఈ సిరీస్‌లోనే తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. మరో దిల్లీ పేసర్ హర్షిత్ రాణా, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ కూడా ఈ సిరీస్‌లోనే అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
తిలక్ వర్మకు జాక్‌పాట్
ఇక బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి మరికొన్ని గంటల వ్యవధిలోనే భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ శివమ్ దూబే వెన్ను గాయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు. దూబే స్థానంలో యువ లెఫ్టార్మ్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ చేర్చింది. మ్యాచ్ జరిగే రోజు ఉదయం గ్వాలియర్‌లో తిలక్ జట్టుతో చేరనున్నారు. ముంబై ఇండియన్స్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు 21 ఏళ్లు. భారత జట్టు తరఫున 16 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 336 పరుగులు చేసి తన స్పిన్ బౌలింగ్‌తో రెండు వికెట్లు కూడా తీశాడు. శివమ్ దూబే గాయం అతనికి జాక్‌పాట్ అని చెప్పవచ్చు.
ఇక టెస్టు సిరీస్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. టెస్టు సిరీస్‌లో ఆడిన వారిలో ఎక్కువ మంది టీ20 సిరీస్‌కు ఎంపిక కాకపోవడం, బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్ ఓటమి ప్రభావం అంతగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టీ20 క్రికెట్‌కు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడం బంగ్లాకు తీరని లోటు కానుంది. షాంటో నేతృత్వలోని బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతోంది. గ్వాలియర్‌లో 14 ఏళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది.అక్కడ కొత్తగా నిర్మించిన శ్రీమంత్ మాధవరావ్ సింధియా స్టేడియం తొలి మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది.
మ్యాచ్ సజావుగా జరిగేనా..?
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా హిందూ మహాసభ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ను కూడా అడ్డుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో హిందూ మహాసభకు మరికొన్ని సంస్థల మద్దతు లభించింది. హిందూ మహాసభ బుధవారం తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారుల ప్రకారం, జిల్లా మేజిస్ట్రేట్, తన ఆదేశంలో, నిరసనలు, సోషల్ మీడియాలో వివాదాస్పద కంటెంట్‌ను వ్యాప్తి చేయడం నిషేధించారు. పోలీసు సూపరింటెండెంట్ సిఫారసు మేరకు జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ రుచికా చౌహాన్ ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ సెక్షన్ 163 కింద ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆర్డర్ ప్రకారం బౌండరీలో ఎవరైనా మ్యాచ్‌కు అంతరాయం కలిగించినా, మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టినా చర్యలు తీసుకోనున్నారు. నివేదికల ప్రకారం, భద్రత కోసం స్టేడియం వెలుపల 1600 మంది పోలీసులను మోహరించారు.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్ ) ), అర్షదీప్ సింగ్, హర్షిత్ సింగ్ రాణా, మయాంక్ యాదవ్ మరియు తిలక్ వర్మ.