ప్రస్తుతం టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ఆధునిక బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సరికొత్త మైలురాయిని నెలకొల్పాడు. WTCలో అత్యధిక ఫోర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మెన్‌గా జో రూట్ అద్వితీయ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో జో రూట్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలతో సహా 375 పరుగులు చేశాడు. అలాగే, ఈ సిరీస్‌లో, జో రూట్ తన 34వ టెస్ట్ సెంచరీని పూర్తి చేయడం ద్వారా ఇంగ్లాండ్ తరపున టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు మరియు 33 టెస్ట్ సెంచరీలు చేసిన అలిస్టర్ కుక్ రికార్డును బద్దలు కొట్టాడు.
2020 నుండి ఇప్పటి వరకు, 56 మ్యాచ్‌లు ఆడిన జో రూట్ 17 సెంచరీలతో 5000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అలాగే, 2020 నుండి, జో రూట్ కు పోటీగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, కేన్ విలియమ్సన్ మాత్రమే ఉన్నాడు. విలియమ్సన్ 11 సెంచరీలు కొట్టాడు. అయితే ఫ్యాబ్ 4లో ఉన్న విరాట్ కోహ్లి, స్టీవెన్ స్మిత్ 30 సగటుతో మాత్రమే పరుగులు చేశారు.
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో జో రూట్ సరికొత్త రికార్డు
శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో జో రూట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సిరీస్‌లో రూట్ 500 WC బౌండరీలను పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో రూట్ మొత్తం 37 బౌండరీలు బాదాడు. మొత్తంగా జో రూట్ ఖాతాలో 520 WTC బౌండరీలు ఉన్నాయి. WTC చరిత్రలో అత్యధిక బౌండరీలు బాదిన బ్యాట్స్‌మెన్‌గా జో రూట్ నిలిచాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా రికార్డు సృష్టించాడు. అతను 4973 పరుగులు చేశాడు. ఈ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ 2023-25లో 1,398 పరుగులు చేశాడు. ప్రస్తుత ఎడిషన్‌లోనూ టాప్‌లో ఉన్నాడు. ఇందులో అతను 29 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు సాధించాడు.
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక ఫోర్లు సాధించిన బ్యాట్స్‌మెన్
జో రూట్ (ఇంగ్లండ్): 520 బౌండరీలు
మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా ): 446 బౌండరీలు
స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా): 379 బౌండరీలు
జాక్ క్రాలే (ఇంగ్లండ్): 353 బౌండరీలు
సచిన్ రికార్డుపై రూట్ కన్ను
టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును జో రూట్ బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నాడు. సచిన్ టెస్టుల్లో 15,921 పరుగులు చేయగా, జో రూట్ 12,402 పరుగులు చేశాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టాలంటే జో రూట్ ఇంకా 3,519 పరుగులు చేయాల్సి ఉంది. జో రూట్ మరో 3 లేదా 4 ఏళ్ల పాటు టెస్టులు ఆడితే.. భారత దిగ్గజం రికార్డును బద్దలు కొడతాడనడంలో సందేహం లేదు.