ఇటీవల కాలంలో భారత జట్టు టెస్టుల్లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులో క్రమశిక్షణ, ఐక్యత, సానుకూల వాతావరణం పెంపొందించడమే లక్ష్యంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. హెడ్ కోచ్, కెప్టెన్, చీఫ్ సెలక్టర్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ పది రూల్స్ ఖరారు చేసింది. ఆటగాళ్లు వీటిని తప్పనిసరిగా పాటించాలని బీసీసీఐ స్పష్టం చేసింది.
1. దేశవాళీ మ్యాచ్‌లలో ఆడడం తప్పనిసరి
భారత జట్టులో ఎంపిక కావాలన్నా, సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కాలన్నా ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్‌లలో ఆడడం తప్పనిసరి. స్థానిక యువతకు స్టార్ క్రికెటర్లతో ఆడే అవకాశం దక్కుతుందని, అనుభవం పొందేందుకు ఇది సహాయపడుతుందని బీసీసీఐ చెప్పింది.
2. జట్టుతో ప్రయాణం తప్పనిసరి
పర్యటనల సమయంలో ఆటగాళ్లు జట్టుతోనే కలిసి ప్రయాణించాలి. ఎవరైనా ఫ్యామిలీతో ప్రయాణించాలంటే ముందుగా హెడ్ కోచ్ లేదా సెలెక్షన్ కమిటీ అనుమతి అవసరం.
3. లగేజీ పరిమితి
లగేజీ పరిమితిని కచ్చితంగా పాటించాలి. 30 రోజులకు మించి విదేశీ పర్యటనలకు 150 కేజీలలోపు లగేజీ తీసుకెళ్లొచ్చు. స్వదేశంలో జరిగే సిరీస్‌లకు 120 కేజీల పరిమితి ఉంటుంది. అదనంగా తీసుకెళితే ఖర్చు ఆటగాళ్లే భరించాలి.
4. వ్యక్తిగత సిబ్బందిపై నిషేధం
టూర్లకు ఆటగాళ్లు తమ వ్యక్తిగత మేనేజర్లు, చెఫ్స్, సెక్యూరిటీని తీసుకురావడం నిషేధం. అనుమతి లేకుండా వీరిని తీసుకురావడానికి వీల్లేదు.
5. ఎన్సీఏ ప్రత్యేక ఖర్చులు
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రత్యేక అవసరాలు ఉంటే వాటి ఖర్చు ఆటగాళ్లే భరించాలి.
6. ప్రాక్టీస్ సెషన్స్ తప్పనిసరి
జట్టు ప్రాక్టీస్ సెషన్లకు ఆటగాళ్లు తప్పనిసరిగా హాజరుకావాలి. ప్రాక్టీస్ ముగిసే వరకు అక్కడే ఉండాలి. హోటల్‌కు వెళ్లడానికి అనుమతి లేదు.
7. ఎండార్స్‌మెంట్‌లకు నో
పర్యటన సమయంలో వ్యక్తిగత షూట్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో పాల్గొనకూడదు. ఆటపై ఏకాగ్రత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనే నిబంధన.
8. విదేశీ పర్యటనల్లో కుటుంబంతో గడిపే అవకాశం
విదేశాల్లో 45 రోజులకు పైగా పర్యటిస్తే భార్య, 18 ఏళ్ల లోపు పిల్లలు రెండు వారాల పాటు ఆటగాళ్లతో ఉండేందుకు అనుమతి ఇస్తారు. ఇతర వ్యక్తులు వస్తే ఖర్చు ఆటగాళ్లే భరించాలి.
9. బీసీసీఐ అధికారిక షూట్స్‌కు
బీసీసీఐ నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు ఆటగాళ్లు తప్పకుండా హాజరవ్వాలి.
10. మ్యాచ్‌ల తర్వాత జట్టుతోనే
మ్యాచ్‌లు ముందుగానే ముగిసినా సిరీస్ ముగిసే వరకు ఆటగాళ్లు జట్టుతోనే ఉండాలి. ఇది జట్టు ఐక్యతను పెంపొందించడంలో సహాయపడుతుంది.