ప్రముఖ ఫుట్‌బాలర్, పోర్చుగీస్ సంచలనం క్రిస్టియానో రొనాల్డో సరికొత్త సంచలనం సృష్టించాడు. తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి అతడికి ఉన్న ఫాలోవర్ల సంఖ్య ఇప్పుడు ఏకంగా 100 కోట్లను దాటింది. ఇక ఈ సంతోషకరమైన విషయాన్ని రొనాల్డో తన అభిమానులతో పంచుకున్నాడు. వారికి థ్యాంక్స్ చెప్తూ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశాడు.
ఇది చాలా ఎక్కువ. మీ ప్రేమకు నా నిదర్శనం. నా కుటుంబం, మీకోసం ఆడాను. ఇప్పుడు నాతో 1 బిలియన్ మంది ఉన్నారు. ఏ పరిస్థితుల్లో అయినా మీరు నాతోనే ఉన్నారు. అందుకు ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను. మనమంతా కలిసి చరిత్ర సృష్టిద్దాం’ అని ట్వీట్ చేశారు. నాపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తూ, నా జీవితంలో భాగమైనందుకు ధన్యవాదాలు. అత్యుత్తమైనది ఇంకా రావాల్సి ఉంది. కలిసి ముందుకు సాగుతూ, గెలుస్తూ మనం చరిత్ర సృష్టిద్దాం అని రొనాల్డో.. ఏ బిలియన్ డ్రీమ్ ఒన్ జర్నీ అనే ట్యాగ్‌తో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోర్చుగల్ దిగ్గజ ఆటగాడికి సుమారు 64 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్‌లో 11.3 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
యూట్యూబ్‌లో ఆరు కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. రొనాల్డో ఇటీవల యూట్యూబ్‌లో ఖాతాను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే యూట్యూబ్ ప్రారంభించిన అరపూటలోనే రొనాల్డో కోటి మంది ఫాలోవర్లు దక్కించుకున్నాడు. కాగా, రొనాల్డో ఇటీవల ఆటలోనూ అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. రొనాల్డో తన కెరీర్‌లో 900వ గోల్ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రొనాల్డో చరిత్రకెక్కాడు.39 ఏళ్ల అతను 1236 మ్యాచ్‌ల్లో 900 గోల్ మార్క్‌ను అందుకున్నాడు. అత్యధిక గోల్స్‌లో రొనాల్డో తర్వాత రెండో స్థానంలో అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ ఉన్నాడు. మెస్సీ 859 గోల్స్ సాధించాడు.