IPL 2025: ఇది కదా అసలు సిసలైన ఐపీఎల్ మ్యాచ్ అంటే.. ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ

Delhi Capitals Thrilling Victory Vipraj Nigam The Unsung Hero

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025లో తమ ప్రస్థానాన్ని అద్భుత విజయంతో ప్రారంభించింది. వైజాగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి కేవలం ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. ఈ విజయంలో అశుతోష్ శర్మ స్పాట్‌లైట్‌లో నిలిచినా, అసలు హీరోగా విప్‌రాజ్ నిగమ్ రాణించాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఇచ్చిన 210 పరుగుల భారీ టార్గెట్‌‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఢిల్లీ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. మొదటి రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ఒక్క పరుగు, అభిషేక్ పోరెల్ డకౌట్ అవ్వగా సమీర్ రిజ్వీ నాలుగు పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. దాంతో 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

కెప్టెన్ అక్షర్ పటేల్, ఫాఫ్ డుప్లెసిస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించినా వరుస ఓవర్లలో పెవిలియన్ బాట పట్టారు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ 6.4 ఓవర్లకు 65 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ ఆరు ఓవర్లు మరో వికెట్ పడకుండా ఆడి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సిక్సర్‌కు ప్రయత్నించిన స్టబ్స్ 34 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో ఢిల్లీ 113 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.

ఆల్‌మోస్ట్ ఢిల్లీ ఓటమి ఖాయం అనుకున్నప్పుడు క్రీజులోకి వచ్చిన విప్‌రాజ్ నిగమ్ బౌండరీల మోత మోగించాడు. అశుతోష్‌‌కి అండగా ఉంటూ హిట్టింగ్ చేశాడు. కేవలం 15 బంతులే ఎదుర్కొన్న విప్‌రాజ్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేసిన విప్‌రాజ్ కీపర్ వెనుకగా బౌండరీకి ప్రయత్నించి క్యాచ్ రూపంలో అవుటయ్యాడు.

రవి బిష్ణోయ్ బౌలింగ్ అవుట్ సైడ్ ఆఫ్ వికెట్‌గా మూడు బౌండరీలు బాది ఢిల్లీ డగౌట్‌లో జోష్ నింపాడు. క్రీజులో ఉన్నత సేపు ఫోర్లు, సిక్సర్లతో మ్యాచ్ మీద ఆశ కల్పించాడు. విప్‌రాజ్ అవుటైన తర్వాత అశుతోష్ శర్మ ఆ ఫామ్‌ని కొనసాగించి మరో మూడు బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ని ముగించి థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ రాణించిన విప్‌రాజ్ ఎయిడెన్ మర్కరమ్ వికెట్ తీసుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన విప్‌రాజ్ నిగమ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ మెగా వేలంలో రూ.50 లక్షలకు దక్కించుకుంది. ఈ యువ ఆల్‌రౌండర్ యూపీటీ20 2024లో సత్తా చాటాడు. లెగ్ స్పిన్నర్ అయిన విప్‌రాజ్ 12 మ్యాచ్‌లలో 20 వికెట్లు తీసుకున్నాడు. 2024-2025 సీజన్‌లో ఇతను ఉత్తరప్రదేశ్ తరఫున అన్ని డొమెస్టిక్ ఫార్మాట్‌లలో అడుగుపెట్టాడు. మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, ఐదు లిస్ట్ ఏ గేమ్స్, ఏడు టీ20లు ఆడాడు.

“అండర్ 19 సమయంలో విప్‌రాజ్ కేవలం బ్యాటర్ మాత్రమే. ఆ తర్వాత మెల్లగా లెగ్ స్పిన్‌లోనూ రాణించడం మొదలుపెట్టాడు. బ్యాటింగ్‌లో అసలు భయమే లేకుండా భారీ షాట్స్ ఆడేవాడు. ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రాణించి ఆ తర్వాత రంజీ ట్రోఫీల్లో ఛాన్స్ కొట్టేశాడు. అతని బ్యాటింగ్ సామర్థ్యం చూసి నేనూ ఆశ్చర్యపోయాను. ఈ రోజు మ్యాచ్‌లో ఇతను ఆడిన తీరును ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. కెరీర్‌లో కచ్చితంగా సక్సెస్ సాధిస్తాడని నమ్ముతున్నాను” అని మ్యాచ్ తర్వాత కుల్దీప్ యాదవ్ చెప్పాడు.