దేశవాళీ క్రికెట్ – దులీప్ ట్రోఫీలో ఆడేందుకు నిరాకరించిన మన స్టార్లు

Domestic Cricket Our Stars Who Refused To Play In Duleep Trophy

న్యూజిలాండ్‌పై టీమిండియా ఘోరంగా ఓడిపోవడానికి ఆ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనకపోవడమే కారణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా బెంగళూరులోని తొలి టెస్ట్ మ్యాచ్ చేజారడంతోనే విమర్శలు వినిపించాయి.

భారత మాజీ టెస్ట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే మొదట విరాట్ కోహ్లీ ని ఉద్దేశిస్తూ అప్పుడే కామెంట్స్ చేశాడు. ఇరానీ ట్రోఫీ వంటి దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌లలో పాల్గొనికోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు సన్నద్ధం కావాలని సూచించాడు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని సూచించాడు. రంజీ, దులీప్, ఇరానీలు టోర్నీలో ఎక్కువగా పాల్గొనాలని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సూచించారు. ఇతర మాజీ క్రికెటర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌లకు ముందు ఈ నలుగురు సీనియర్ ఆటగాళ్లకు సెప్టెంబర్ 5 నుంచి 22 వరకు బెంగళూరు, అనంతపురంలో జరిగే దులీప్ ట్రోఫీ టోర్నీలో కూడా పాల్గొనే అవకాశం లభించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆడాలని బీసీసీఐ సెలక్షన్ బోర్డులోని అజిత్ అగార్కర్ సీనియర్ ఆటగాళ్లకు ఇంత అవకాశం ఇచ్చినా వారు ఆడేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ తమకు రెస్ట్ కావాలని ఈ టోర్నికి దూరంగా ఉన్నారట. సరైన మ్యాచ్ ప్రాక్టీస్ ఉంటే ఖచ్చతంగా మన స్టార్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేసేవారన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది.

సునీల్ గవాస్కర్ ఆగ్రహం
భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ కోహ్లీ, రోహిత్, బుమ్రా వంటి ఆటగాళ్ల దేశవాళీ టోర్నీలో ఆడుతున్నట్లయితే.. వారికి సరైన శిక్షణ లభించేది అని అన్నారు. డొమెస్టిక్ లో ఆడటం వలన ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకునే అవకాశం లభిస్తుందని అన్నాడు. బంగ్లాదేశ్‌ను ఓడించిన మాట వాస్తవమే. అయితే న్యూజిలాండ్‌పై విఫలమడంతో డొల్లతనం బయటపడిందన్నారు. న్యూజిలాండ్ లో ఉన్న బౌలర్లు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లు.. వీరంతా భారత్‌లో ముఖ్యంగా ఐపీఎల్‌లో చాలా మ్యాచ్ లు ఆడారని, అందుకే ఇక్కడి పిచ్‌, వాతావరణం గురించి వారికి బాగా తెలుసునని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

కివీస్‌తో ఆడిన భారత జట్టులో ఉన్న శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్.. వీరంతా దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నారు. కానీ కోహ్లీ సరిగ్గా 12 ఏళ్లుగా క్రితం దేశవాళీ టోర్నీలో ఆడాడు. రోహిత్ శర్మ కూడా చాలా కాలంగా దేశవాళీ క్రికెట్‌లో కనిపించడం లేదు.