ఐసీసీ అవార్డుల్లో బూమ్ బూమ్ బుమ్రా : తొలి టీమిండియా పేసర్ గా రికార్డు..

Jasprit Bumrah Shines In ICC Awards A Historic Milestone For India

భారత క్రికెట్‌లో మరో భారీ గౌరవం వచ్చింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా 2024 సంవత్సరానికి గానూ ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2024లో టెస్టుల్లో అతడి అసాధారణ ప్రదర్శన ఈ అవార్డును గెలుచుకునేందుకు దోహదపడింది. బుమ్రా ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారత పేసర్ కావడం విశేషం.

2024లో బుమ్రా 13 టెస్టుల్లో 14.92 సగటుతో 71 వికెట్లు తీశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సహా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లపై అతడి రికార్డు స్పెల్స్ గుర్తుండిపోతాయి. బుమ్రా, 32 వికెట్లు సాధించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఈ సంవత్సరంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన బుమ్రా, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

ఈ అవార్డు రేసులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, శ్రీలంక ఆటగాడు కామిందు మెండిస్, హ్యారీ బ్రూక్‌లను వెనక్కి నెట్టి బుమ్రా విజయం సాధించాడు. బుమ్రా, రాహుల్ ద్రవిడ్ (2004), గౌతమ్ గంభీర్ (2009), వీరేంద్ర సెహ్వాగ్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2018) తర్వాత ఈ అవార్డును గెలుచుకున్న ఆరో భారత క్రికెటర్‌గా నిలిచాడు.

ఇదే కాదు, మహిళల విభాగంలో స్మృతి మంధాన 2024 వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. 28 ఏళ్ల మంధాన తన కెరీర్‌లో రెండోసారి ఈ అవార్డును దక్కించుకుంది. గత ఏడాది ఆమె 13 వన్డేల్లో 57.46 సగటుతో 747 పరుగులు చేయడం, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లపై సెంచరీలు సాధించడం ఆమె విజయానికి కారణమయ్యాయి.

ఇదిలా ఉండగా, బుమ్రా ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అతడు త్వరగా కోలుకుని మళ్లీ తనదైన మయాజాలం కొనసాగించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.