చెన్నై సూపర్ కింగ్స్‌లో రిషబ్ పంత్!

Rishabh Pant To Join CSK

టీమ్ బ్యాలెన్స్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకునే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈసారి కూడా తూకం వేసి, రిటెన్షన్ జాబితాను చాలా జాగ్రత్తగా విడుదల చేసింది. వెటరన్ మహేంద్ర సింగ్ ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచిన ఫ్రాంచైజీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, మతీష్ పతిరానా, శివమ్ దూబేలను కొనసాగించింది.
అయితే త్వరలో జరగనున్న వేలం ప్రక్రియలో ఎవరిని కొనుగోలు చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పుడు సురేష్ రైనా ప్రకటన ఈ క్యూరియాసిటీని మరింత పెంచింది. కారణం అతను ఇప్పుడు టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ డాషింగ్ రిషబ్ పంత్ ను ఉద్దేశిస్తూ పలు కామెంట్లు చేశాడు.

ధోనీ వారసుడు ఎవరు?
మహేంద్ర సింగ్ ధోని కారణంగా CSK కి దేశవ్యాప్తంగా భారీ అభిమానుల సంఖ్య ఉంది. అయితే కెప్టెన్ కూల్ వయసు ఇప్పుడు 43 ఏళ్లు. ఈసారి ఆడుతున్నారన్నది నిజమే అయినా.. ఈ ప్రయాణం ఎంత దూరం ఉంటుందో తెలియదు. కాబట్టి ధోనీ ప్రత్యామ్నాయ ఆటగాడిని వెతకాలి. ఇది అంత సులభం కాదు. గత సీజన్‌లో సీఎస్‌కే జట్టుకు రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పేపర్‌పై రితురాజ్‌ లీడర్‌గా ఉన్నప్పటికీ మైదానంలో ధోనీ నే కెప్టెన్ గా అందరికి అనిపిస్తాడు.

ఇది ఇలా ఉండగా, ధోనీ స్థానాన్ని చక్కగా భర్తీ చేయగల మరో ఆటగాడు CSKకి అవసరం. ఈ విషయంలో రిషబ్ పంత్ సరైన ఎంపిక. అతను CSKలో చేరే అన్ని అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

రైనా ఏం చెప్పాడు?
తాజాగా సురేశ్ రైనా చేసిన ఓ కామెంట్ రిషబ్ పంత్ సీఎస్కేలోకి రానున్నాడనన్న ఉహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల ఢిల్లీలో ఎంఎస్ ధోనీని కలిశాను, పంత్ కూడా అక్కడే ఉన్నాడు. త్వరలో ఎవరైనా పసుపు రంగు జెర్సీని ధరించడం ఖాయం అని జియో సినిమాతో అన్నారు. అలాగే రైనా తాజాగా ధోనిని కలిసిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

పంత్ మరియు ధోనీ చాలా సన్నిహితంగా ఉంటారు. దీంతో అతనిని జట్టులో చేర్చుకోవాలని ధోని ఫ్రాంచైజీని ఒత్తిడి చేయవచ్చు. రిటెన్షన్ జాబితాను విడుదల చేసిన తర్వాత, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు వేలం ప్రక్రియలో 55 కోట్ల రూపాయలు మిగిలి ఉంది. చూడాలి మరి ధోని వారసుడిగా పంత్ ను దక్కించుకుంటుందో లేదో తెలియాలంటే వేలం దాకా ఆగాల్సిందే.