దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. టీమిండియాలో ముగ్గురు ఆల్ రౌండర్లు

T20 Series With South Africa Three All Rounders In Team India

న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ వైట్ వాష్‌ కు గురయిన టీమిండియా.. ఇప్పుడు టీ20 ఫార్మాట్ లో అలరించడానికి సౌతాఫ్రికా వెళ్లింది. కాకపోతే టెస్ట్ జట్టులో ఉన్న ఏ ఆటగాడు కూడా ఈ పొట్టి ఫార్మాట్ లో ఆడటం లేదు. శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. ఈ పర్యటనలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా యువ ఆటగాళ్లు సందడి చేయనున్నారు.

శ్రీలంక పర్యటనతో టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలను పూర్తిస్థాయిలో అందుకున్నప్పటి నుంచి సూర్యకుమార్‌కు సారథిగా అజేయ రికార్డు ఉంది. శ్రీలంక సిరీస్‌ను, ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను సూర్యసేన క్లీన్ స్వీప్ చేసింది. ఇక దక్షిణాఫ్రికాపై ఓవరాల్‌గా భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడగా టీమిండియా 15 మ్యాచ్‌ల్లో, సఫారీలు 11 మ్యాచుల్లో గెలిచారు.

ఆర్సీబీ స్టార్ ప్లేయర్ యశ్ దయాల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. యశ్ దయాల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 10 నెలల తర్వాత తిరిగి తుదిజట్టులో చోటు దక్కించుకోనున్నాడు. బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌లో ఓపెనింగ్ జోడీగా హిట్ అయిన అభిషేక్-సంజు శాంసన్ ద్వయం సౌతాఫ్రికా పర్యటనలోనూ కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనుంది.

హార్దిక్, అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్లుగా తుది జట్టులో కొనసాగనున్నారు. అయితే ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తే వరుణ్ చక్రవర్తికి బదులుగా రమణ్‌దీప్ సింగ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అక్షర్‌తో రవి బిష్ణోయ్ స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నాడు. పేస్ బాధ్యతలను అర్షదీప్, యశ్‌లతో పాటు హార్దిక్ మోయనున్నాడు.

దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి టీమ్‌ఇండియా జట్టులో రమణదీప్ సింగ్ కూడా ఎంపికయ్యాడు. రమణదీప్ సింగ్ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు. ఈ టోర్నీలో కూడా రమణదీప్ బాల్, బ్యాట్, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ ఫ్లాప్ కావడంతో రమణదీప్ విధ్వంసం సృష్టించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రమణదీప్ 64 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఆటగాడు భారత్‌లో రెండో ఆల్‌రౌండర్ గా హార్దిక్ పాండ్యాతో కలిసి భాగం కానున్నాడు.

టీమ్ ఇండియా
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ విశాక్, అవేశ్ ఖాన్, యష్ దయాళ్.