మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ మహిళల జట్టు జోరందుకుంది. నిన్న శ్రీలంకతో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో సాధికారిక ప్రదర్శన కనబర్చిన భారత మహిళా క్రికెట్ జట్టు 82 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో సెమీ-ఫైనల్ అవకాశలను మెరుగుపరుచుకుంది. ఇక టీ20 ప్రపంచకప్‌లో పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఇంతకు ముందు 2014లో సిల్హెట్లో బంగ్లాదేశ్‌పై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా గ్రూప్ ‘ఎ’ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ఆసియా ఛాంపియన్ శ్రీలంక జట్టు నిలిచింది. స్కాట్లాండ్ ఇప్పటికే గ్రూప్ ‘బి’ నుండి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌కు ముందు, భారత్ 5 జట్ల గ్రూప్ ‘ఎ’ పట్టికలో తాము ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక్కో విజయం-ఓటమితో 4వ స్థానంలో ఉంది. తద్వారా ఆసియా చాంపియన్ శ్రీలంకపై భారత్ గెలవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాది ఆసియా కప్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో శ్రీలంక చేతిలో ఓడిన భారత మహిళా క్రికెట్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది మరియు 82 పరుగుల విజయంతో నెట్ రన్ రేట్‌ను -1.217 నుండి +0.560కి పెంచుకుని 2వ స్థానానికి ఎగబాకింది.
గ్రూప్ దశలో, భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, టీమిండియా సులభంగా సెమీ-ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఆస్ట్రేలియాతో తలపడితే, పాకిస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం, సెమీ-ఫైనల్ స్థానం కోసం గ్రూప్ ‘ఎ’లో భారత్ మరియు న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. ఇక ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ రేసులో ముందంజలో ఉంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (40 బంతుల్లో 43 పరుగులు), స్మృతి మంధాన (38 బంతుల్లో 50 పరుగులు) తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు.
అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ధనాదన్ బ్యాటింగ్ చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. గత మ్యాచ్‌లో గాయపడినా.. అర్ధ సెంచరీతో ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని సందేశాన్నిచ్చారు. శ్రీలంక బౌలర్లను చిల్చీ చెండాడుతూ హర్మన్‌ప్రీత్ 27 బంతుల్లో 8 ఫోర్లు, మరో సిక్సర్‌తో 52 పరుగులు చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ.
శ్రీలంక 90 పరుగులకు ఆలౌట్
ఛేజింగ్ లో టీమ్ ఇండియా బలమైన బౌలింగ్ దాడికి శ్రీలంక బ్యాటర్లు ఏ మాత్రం నిలవలేకపోయారు. ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఆరంభంలోనే 2 వికెట్లు తీసి భారత్‌కు శుభారంభం అందించగా.. అనంతరం స్పిన్నర్ ఆశా శోభన, పేసర్ అరుంధతి రెడ్డి చెరో 3 వికెట్లు తీసి శ్రీలంక బ్యాటింగ్ సత్తాను దాచారు. స్పిన్నర్లు రాంకా పాటిల్, దీప్తి శర్మ కూడా ఒక్కో వికెట్ తీయడంతో శ్రీలంక 90 పరుగులకే ఆలౌటైంది. అధ్బుతమైన బ్యాటింగ్ చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.