ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు టీమిండియా దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయ తీరానికి చేర్చాడు. మరోవైపు, రెండో సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు పోటీ పడనున్నాయి. అయితే, ఫైనల్‌కు ముందు భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడినట్టు సమాచారం. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో బ్యాటింగ్ చేస్తుండగా, పరుగు తీసే క్రమంలో ఆయన కాలికి గాయం అయింది. క్రీజ్‌లోకి తిరిగి వచ్చిన హార్దిక్ కొంత అసౌకర్యంగా ఉన్నట్టు కనిపించాడు.
గాయం తర్వాత కొంత ఇబ్బందిపడ్డప్పటికీ, హార్దిక్ అద్భుతమైన షాట్లతో భారత్‌ను విజయానికి చేరువ చేశాడు. గతంలో కూడా ఆయన చీలమండ గాయంతో బాధపడ్డాడు. ఈ గాయం తిరగబెడుతుందేమోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయం తీవ్రంగా ఉంటే, ఫైనల్ మ్యాచ్‌కు అతను దూరం కావాల్సి వస్తుంది.
భారత జట్టు సిద్ధమైన సమయంలో హార్దిక్ గాయం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారవచ్చు. అయితే, హార్దిక్ గాయంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు హార్దిక్ కోలుకోవాలనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.