సుధీర్ఘ విరామం తరువాత టీమిండియా బరిలోకి దిగబోతోంది. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. రెండో టెస్టు మార్చి 27 నుంచి కాన్పూర్‌లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఇరు జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నాయి.
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. తొలి టెస్టు మ్యాచ్‌కు ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. ఎడమచేతి వాటం పేసర్ యశ్ దయాల్‌కు జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి. అలాగే, రిషబ్ పంత్ ఈ సిరీస్ ద్వారా భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు.
2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత పంత్ టెస్టు ఆడనుండటం ఇదే తొలిసారి. ఐపీఎల్-2024లో 13 మ్యాచ్‌ల్లో 446 పరుగులు చేసిన తర్వాత పంత్ టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికయ్యాడు. అనంతరం శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా సెలక్ట్ అయ్యాడు. తాజాగా బంగ్లాదేశ్ సిరీస్‌తో అన్ని ఫార్మాట్లలో పునరాగమనం చేయనున్నాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా-బీ తరఫున సెకండ్ ఇన్నింగ్స్‌లో పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. కాగా, పంత్ రాకతో తెలుగు కుర్రాడు, వికెట్ కీపర్ కేఎస్ భరత్ టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. పంత్‌తో పాటు వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా టీమిండియాలో ఉన్నప్పటికీ కేవలం బ్యాటర్‌గా స్థానం దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో సత్తాచాటిన సర్ఫరాజ్ ఖాన్ తన స్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ జట్టులో చోటు కోల్పోయాడు.
ఇక జట్టులో ఫాస్ట్ బౌలింగ్‌లో ప్రధాన మార్పులు కనిపించాయి. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో పాటు ఆకాశ్ దీప్ , యశ్ దయాల్ జట్టులో స్థానం దక్కించుకున్నారు. వీరిద్దరు దులీప్ ట్రోఫీలో సత్తాచాటుతున్న విషయం తెలిసిందే. స్పిన్నర్లుగా అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ ఎంపికయ్యారు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.