తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక జరిగిన ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం కంటోన్మెంట్. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికకు కూడా ఈసీ నోటిఫికేషన్ జారి చేసినప్పటి నుంచీ ఆ నియోజకవర్గ ఫలితంపై ఉత్కంఠ ఏర్పడింది. అయితే మంగళవారం అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్.శ్రీగణేష్, బీజేపీ అభ్యర్థిగా వంశ తిలక్, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా దివంగత శాసనసభ్యుడు జి.సాయన్న కుమార్తె, దివంగత శాసనసభ్యురాలు లాస్య నందిత అక్క నివేదిత పోటీలో నిలిచారు. దివంగత కంటోన్మెంట్ శాసనసభ్యుడు జి.సాయన్న మరణించడంతో ఆయన స్థానంలో బీఆర్‌ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న చిన్నకుమార్తె లాస్య నందితకు టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో 17వేల పైచిలుకు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఎన్.శ్రీగణేష్‌పై లాస్య నందిత విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో లాస్య నందితకు నివేదిత అన్నీ తానై వ్యవహరించారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన నందిత కొద్దికాలానికే రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఉప ఎన్నికలో ఆ టికెట్‌ను కేసీఆర్ నందిత సోదరి నివేదితకు ఇచ్చారు.
ఒకే ఏడాదిలో.. ఒకే ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేగా ఉండగానే మృతిచెందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఉప ఎన్నికలో అదే కుటుంబానికి చెందిన నివేదిత గెలుపుఖాయమని చాలా మంది భావించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పదవిలో ఉండగా మరణించారు. వారి వారసురాలిగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆడబిడ్డను గెలిపించాలంటూ ఆ పార్టీ నేతలు నివేదిత తరఫున ప్రచారం చేశారు. తన నాన్న సాయన్న, చెల్లి లాస్య నందితలను ప్రజలకు పదే పదే గుర్తు చేస్తూ, కన్నీళ్లు కార్చుతూ నివేదిత కూడా ఓట్లను అభ్యర్థించారు. అయినప్పటికీ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి నివేదిత విషయంలో సానుభూతి పని చేయలేదు. నందిత మరణానంతరం నివేదిత ఉప ఎన్నికలో నిలబడ్డారు. సానుభూతితో గెలుస్తారని చాలామంది భావించినా ఆమె మూడో స్థానానికే పరిమితం అయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY