తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కానుంది. ప్రభుత్వ సేవలను ఇంటి నుంచి సులభంగా పొందేలా మీసేవ యాప్‌లో కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మీసేవ మొబైల్ యాప్ ద్వారా 150 రకాల పౌరసేవలను ఇంటి నుంచే పొందవచ్చు. వీటిలో పర్యాటక ప్యాకేజీల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, వయోవృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ, సదరం సర్టిఫికెట్లు, వన్యప్రాణుల సహాయం, కలపమిల్లుల అనుమతులు వంటి సేవలు ఉన్నాయి.
ఇవి మాత్రమే కాకుండా, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, కలెక్టరేట్ల వంటి రద్దీ ప్రాంతాల్లో ఇంటరాక్టివ్ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా దరఖాస్తులు నింపడం, చెల్లింపులు చేయడం, సర్టిఫికెట్లు ప్రింట్ తీసుకోవడం వంటి పనులు చేయవచ్చు.
గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్:
కేంద్ర ప్రభుత్వం ‘భారత్ నెట్’ ద్వారా తెలంగాణలో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలను అందించనుంది. టీఫైబర్ పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటగా పెద్దపల్లి, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో 4,000 కుటుంబాలకు కేబుల్ టీవీతో కూడిన బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించనున్నారు. ఈ సేవల కోసం కేవలం రూ.300 మాత్రమే ఛార్జ్ చేస్తారు. దీని ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, ఇతర సంస్థలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించనున్నారు.
ప్రత్యేక సేవలు & ప్రాజెక్టులు:
టీజీన్యాబ్ అప్లికేషన్: మాదకద్రవ్యాల నివారణకు విద్యార్థుల మానసిక ప్రవర్తన మార్పునకు ప్రత్యేక అప్లికేషన్.
ప్రాజెక్టు సన్మతి: గ్రామీణ మహిళలకు డిజిటల్ అవగాహన కోసం రూపొందించిన కార్యక్రమం.
అడెక్స్: వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలకు డేటా ఆధారిత పరిష్కారాలు.
మీసేవ యాప్ ప్రారంభం తెలంగాణ ప్రజలకు మరింత సులభతరం చేయనుంది. ఇంటర్నెట్ సేవలు, డిజిటల్ అవగాహనతో ప్రజల జీవితాల్లో మరింత మార్పు తేలియాడనుంది.