తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది.
ఆదిలాబాద్, నిజామాబాద్,కరీంనగర్,కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతేకాకుండా ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇదిలా ఉండగా, గురువారం రాత్రి హైదరాబాద్లో భారీ వర్షం దంచి కొట్టింది. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం నుంచి నాన్ స్టాప్ వర్షం కురవడంతో భాగ్యనగరవాసులు తడిసి ముద్దయ్యారు. చాలా చోట్లు డ్రెయినేజీలు పొంగి ప్రవహించడంతో పాటు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ఇదే అవకాశంగా తీసుకున్న క్యాబ్, ఆటో డ్రైవర్లు రేట్లను అమాంతం పెంచేసారు, చాలా చోట్ల బుకింగ్ అవక బయటకు వెళ్లిన వారు ఇంటికి చేరడానికి కూడా ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు నేడు, రేపు కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల హెచ్చరికపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి నగరవాసులకు కొన్ని సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆమె సూచించారు. భారీ వర్షాల హెచ్చరికతో ఇప్పటికే జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. జీహెచ్ఎంసీలో వర్షాల ఇబ్బందులపై కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన అధికారులు.. ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే 040-21111111 / 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.