సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నమోదు చేసిన కేసులో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ జైలుకెళ్లే పరిస్థితి ఎదుర్కొన్నారు. ఈ కేసులో 11వ నిందితుడిగా ఆయనను అరెస్టు చేసిన పోలీసులు, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించాలని భావించారు. కానీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది.
హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ, వ్యక్తిగత పూచికత్తు ఆధారంగా ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. జైలు సూపరింటెండెంట్‌కు షూరిటీలు సమర్పించాలని సూచించింది. ‘‘అరుణాబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర’’ కేసు తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చిన హైకోర్టు, అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
కేసులో ఆరోపణలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “105(B), 118 సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవు” అని న్యాయమూర్తి పేర్కొన్నారు. నటుడు అయినంత మాత్రాన ఆయనకు సాధారణ పౌరుడికి ఉన్న హక్కులు నిరాకరించరాదని, చనిపోయిన రేవతి కుటుంబం పట్ల సానుభూతి ఉన్నా, నేరాన్ని నిందితులపై రుద్దలేమని తీర్పులో వెల్లడించారు.
ఈ కేసులో అల్లు అర్జున్ సీనియర్ లాయర్ల సహాయంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్లి హైకోర్టులో క్వాష్ పిటిషన్లను అత్యవసరంగా విచారింపజేయించారు. ప్రభుత్వ లాయర్లు కౌంటర్ వాదనలు గట్టిగా చేసినప్పటికీ, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం అల్లు అర్జున్ అభిమానుల్లో కొంత ఊరట కలిగించింది.