సంధ్య థియేటర్ ఘటన తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈనెల 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ.. హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
ఈ ఇన్సిడెంట్ రాజకీయంగానూ పెను దుమారం రేపింది. ఈ వ్యవహారంలో పార్టీలు అనుకూల, ప్రతికూల వర్గాలుగా విడిపోయాయి. ఎవరి వాదనలతో వారు ముందుకెళ్తున్నారు. రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోకుండా.. సినిమా విషయంలోనూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. అల్లు అర్జున్ అరెస్టు నుంచే పార్టీల్లో ఈ ధోరణి కనిపిస్తుంది. ప్రధాన పార్టీలు రెండు కేటగిరీలుగా విడిపోయి ప్రవర్తిస్తున్నాయి.
థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం.. ఓ మహిళ మృతి చెందడం పై కాంగ్రెస్ పార్టీ ఒక వైపు ఉండగా, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మాత్రం అల్లు అర్జున్‌ను సమర్ధిస్తూ మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. అసలు ఘటనా స్థలంలో ఏం జరిగిందో డిటైల్డ్‌గా వివరించారు. దీనిపై అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. దీంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. అల్లు అర్జున్ వ్యవహారశైలి, ఆయన తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఆ పార్టీ నాయకులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ బన్నీపై అటాక్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం తీవ్రస్థాయిలో స్పందించారు.మరోవైపు.. ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి యత్నించారు.
మరోవైపు బీజేపీ నాయకులు అల్లు అర్జున్‌కు అండగా నిలిచారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సహా పలువురు బీజేపీ నేతలు పాజిటివ్‌గా స్పందించారు. సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి కక్ష కట్టారంటూ లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు బండి సంజయ్. దీంతో అల్లు అర్జున్ సమస్య కాస్త రాజకీయ వైరంగా మారింది. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన పై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ ప్రేరేపించింది కాదన్నారు. ఇటు కాంగ్రెస్ నేతల వరుస మాటల దాడులకు కళ్లెం వేసేలా.. అల్లు అర్జున్ ఘటనపై తమ పార్టీ నేతలెవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.