Betting Apps Case: ఎఫ్ఐఆర్ రద్దు కోసం హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల

టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, యాంకర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై నమోదైన బెట్టింగ్‌ యాప్‌ల కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా, ప్రముఖ యాంకర్‌ శ్యామల ఈ కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని ఆమె కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదైంది. మియాపూర్‌కు చెందిన ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు టాలీవుడ్‌ నటులు, యాంకర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిపి 25 మంది పై ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. కేసు నెం. 393/2025 కింద, 318 (4) 112, రెడ్ విత్ 49 బీఎన్ ఎస్ 3, 3(ఏ) 4, టీఎస్ జీఏ,66-డి ఐటీఏ 2000-2008 సెక్షన్ల ప్రకారం నేరపరిశీలన జరుగుతోంది. పోలీసుల నుంచి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు కూడా జారీ అయ్యాయి.

ఇక, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం చేసిన కేసులో టీవీ యాంకర్‌ విష్ణుప్రియ, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ రీతూ చౌదరిలను పోలీసులు విచారించారు. బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసినందుకు అనేక మంది సెలెబ్రిటీలకు పోలీసులు నోటీసులు పంపారు. అందులో దగ్గుబాటి రాణా, ప్రకాశ్‌ రాజ్‌, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్‌, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర రాజన్‌, వాసంతి కృష్ణన్‌, శోభ శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహ పఠాన్‌, పండు, పద్మావతి, ఇమ్రాన్‌ ఖాన్‌, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్‌, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు శేషాయనీ సుప్రీత తదితరులున్నారు.

ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు ఈ వ్యవహారంలో మరిన్ని విచారణలు చేపట్టే అవకాశముంది.