చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో నిజామాబాద్‌కు చెందిన నాగనపల్లి సాయన్న, ఖమ్మంకి చెందిన భూక్యా గోపాల్ రావు, భూక్యా శ్రీను, అంకోలు శిరీష, బేబి రాణి ఉన్నారు. వీర రాఘవ రెడ్డిపై అబిడ్స్, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. నిందితుల రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి.
ఈ నెల 7న ఉదయం 20 మంది (మహిళలు, పురుషులు) సీఎస్ రంగరాజన్ ఇంటికి వెళ్లి, రామదండు కోసం మనుషులను రిక్రూట్ చేయాలని, ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రంగరాజన్ ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. మణికొండ పంచవటి కాలనీలో ఈనెల 8న పోలీసులు వీర రాఘవ రెడ్డిని అరెస్ట్ చేశారు. విచారణలో రాఘవ రెడ్డి తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
వీర రాఘవ రెడ్డి 2014లో ఆంధ్ర అసోసియేషన్ ఫర్ తెలంగాణ, ఆంధ్ర పీపుల్ పేరుతో సంఘం ఏర్పాటు చేసి, హిందూ ధర్మ రక్షణ కోసం ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రసంగాలు ఇచ్చి, అనేకమందిని ప్రేరేపించాడు. 2022లో రాఘవ రెడ్డి తన భార్యను చైర్మన్‌గా పెట్టి కోసలేంద్ర ట్రస్ట్‌ను ప్రారంభించాడు. ఈ ట్రస్ట్ ద్వారా ఫండ్లు సేకరించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్యామ్ సహాయంతో రామరాజ్యం వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు.
దాడికి ముందు రాఘవ రెడ్డి దామోదర్ రెడ్డి అనే న్యాయవాది సాయంతో దమ్మాయిగూడలో ఉదా రెడ్డి ఇంట్లో నిందితులతో సమావేశమయ్యాడు. రామరాజన్‌ను మరొకసారి కలిసి మాట్లాడాలని, అంగీకరించకపోతే దాడి చేయాలని నిర్ణయించారు. జనవరి 25న పెనుగొండ ఆలయంలో నిందితులు సమావేశమయ్యారు. ఫిబ్రవరి 4న మరోసారి దమ్మాయిగూడలో సమావేశమై తమ చర్యలను సమీక్షించారు.
ఈ నెల 7న ఉదయం 8 గంటలకు రంగరాజన్ ఇంటికి చేరుకున్న నిందితులు, అతను స్నానం చేసి వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పినా, నిర్లక్ష్యంగా అతనిపై దాడి చేశారు. తమ ఆదేశాలను పాటించకపోతే అపహరించి తీసుకెళ్తామని బెదిరించారు. దాడి దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. కేసులో మొత్తం 22 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు, మరో 16 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డిపై గతంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు కూడా ఉందని వెల్లడించారు.